మళ్లీ మళ్లీ వివాదాల్లోకి ఏపీ పోలీసులు...!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ పోలీసులు వరుస వివాదాల్లో కూరుకుపోతున్నారు. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కూడా పోలీసుల తీరులో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు. మళ్లీ మళ్లీ చేసిన తప్పులే రిపీట్ చేస్తున్నారు. ప్రతిపక్షాలకు టార్గెట్ గా మారుతున్నారు ఏపీ పోలీసులు. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. హోమ్ గార్డు స్థాయి నుంచి ఏకండా డీజీపీ వరకు కూడా అన్నిస్థాయిల అధికారులు, సిబ్బందిపైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. రాజధాని అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులపై ఏకపక్ష దాడులు, తెలుగుదేశం పార్టీ నేతలే టార్గెట్ గా కేసులు నమోదు చేయడం... ఇలా ఎన్నో అంశాలు పోలీసుల తీరును తప్పుబడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో శభాష్ పోలీసు అనిపించుకున్న పోలీసులు... అదే వైరస్ కారణంగా విమర్శల పాలయ్యారు కూడా.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారనే అపవాదు పోలీసులపై ఉంది. ఆ తర్వాత వైసీపీ నేతలు దాడులు చేస్తే... వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక కరోనా వైరస్ సమయంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీలకు అనుమతి ఇచ్చి బందోబస్తు కూడా నిర్వహించిన పోలీసులు... తెలుగుదేశం పార్టీ నేతలపై మాత్రం కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు కారుపై దాడి జరిగితే... దాడి చేసిన వారిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోక పోగా... దేవినేని ఉమాపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి జైలులో కూడా పెట్టారు. ఇక పట్టాభి ఇంటిపై రెండు సార్లు దాడి జరిగితే... ఇప్పటి వరకు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయలేదు. కానీ.... పట్టాభిపై మాత్రం ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపారు కూడా. ఇక చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయంలో చేపట్టిన దీక్షకు హాజరయ్యే నేతలను అడ్డుకున్నారనే అపవాదు కూడా పోలీసులు మూట గట్టుకున్నారు. కానీ వైసీపీ నేతల జనాగ్రహ దీక్షలకు మాత్రం దగ్గరుండి బందోబస్తు నిర్వహించారు. వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: