ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయాలు...!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ పురుడు పోసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతల మధ్య బిక్కుబిక్కు మంటోంది. ఒక్కో నేత మాటలు వింటుంటే... బాబోయ్ అని బెంబేలెత్తుతున్నారు ఏపీ ప్రజలు. వాళ్లు చెప్పే మాటలు ఆచరణలోకి వస్తే.... పరిస్థితి ఎలా ఉంటుందో అని... ఇక వాటి పర్యావసానాలు ఇంకెలా ఉంటాయో అని భయపడుతున్నారు కూడా. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుత నేతల మధ్య వివాదాలకు కూడా ఈ వ్యాఖ్యలే కారణమవుతున్నాయి కూడా. నిన్న మొన్నటి వరకు న్యాయ పరమైన వేధింపులకు గురైన నేతలు కాస్తా.... ఇప్పటి నుంచి ఫ్యాక్షన్ తరహా వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. పట్టాభి వ్యాఖ్యలకు నిరనసగా ఏకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాడి చేశారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. అంతటితో ఆగితే బాగుండేది. కానీ ఆ తర్వాత పరిణామాలే తీవ్రంగా ఉన్నాయి.
పట్టాభి ఇంటిపై దాడి చేసిన తర్వాత... అక్కడ కనిపించిన వారందరిపైనా రాడ్లతో దాడి చేశారు. ఇక టీడీపీ కార్యాలయంలో కూడా సిబ్బందిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత ఏకంగా బాంబులేసి లేపేస్తాం అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చేశారు. వైసీపీ దాడులకు నిరసనగా... టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావంగా టీడీపీ నేతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా జనాగ్రహ దీక్ష పేరుతో రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సమయంలో నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చంద్రబాబు కుప్పం వస్తే కారుపై బాంబు వేస్తామని వైసీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి అయితే పట్టాభి సంగతి ఇక క్లోజ్ అనేశారు. ఇక కొందలు మంత్రులు అయితే బాబు, లోకేష్ రాష్ట్రంలో ఎలా తిరుగుతారో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇదే తరహా కామెంట్స్ చేశారు. అధినేత చంద్రబాబు ఓ గంట కళ్లు మూసుకుంటే... తామేమిటో చూపిస్తామన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. ఇక మరో నేత అయితే... మేము తలుచుకుంటే డీజీపీ కార్యాలయమే మిగలదు అనేశారు. ఇలాంటి వ్యాఖ్యలపై ప్రస్తుతం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: