ఏపీ పాలిటిక్స్‌: కేఏ పాల్‌ పొలి కేక!

N.Hari
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తీవ్రంగా స్పందించారు. ఒకరు తిడితే.. మరొకరు దాడులు.. ఇదంతా కాదు కానీ.. నేనే వస్తున్నా అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై, ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కేఏ పాల్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. ఆ రెండు పార్టీల ప్రభుత్వాలు దోపిడీకే పరిమితం అయ్యాయని ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ సర్కారు దేశాన్ని అప్పుల పుట్టిగా మార్చిందని దుయ్యబట్టారు. ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధికి ప్రజాశాంతి పార్టీతో కలిసి పనిచేసేందుకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, నిరుద్యోగులు, మహిళలు, యువత తోపాటు అన్ని సామాజిక వర్గాల వారు కలిసి ఒక్కటి కావాల్సిన అవసరముందని కూడా కేఏ పాల్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రేమించేవారు, అలాగే అభివృద్ధి కాంక్షకులు ప్రజాశాంతి పార్టీతో కలిసి అడుగులు వేయాలని కోరారు. ఈనెల 22వ తేదీ శనివారం ఉదయం హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులు ప్రజా శాంతి పార్టీలో చేరనున్నారని కేఏ పాల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి తనతో తప్ప ఇంకెవరితోనూ సాధ్యంకాదని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివద్ధి కోసం అహర్నిశలు పని చేయడానికి తాను సిద్ధ పడ్డానని కేఏ పాల్‌ వెల్లడించారు. త్వరలో తాను వస్తున్నానంటూ తెలుగు ప్రజలకు ఆయన సందేశమిచ్చారు.
దేశ మంతటా ప్రజానీకం సమస్యలతో సతమతం అవుతోందనీ, రైతుల ఆత్మహత్యలు అధికమవుతున్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో బూతులు, దాడులు, అరెస్టులతో రాజకీయం చేస్తున్నారనీ, రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇక జరిగింది చాలనీ, తాను రాష్ట్రానికి వచ్చేస్తున్నాననీ ఆయన అన్నారు. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అందరూ కలిసికట్టుగా అడుగులు వేద్దామని కేఏ పాల్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏపీలో విమర్శలు, దాడులతో రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు పోటాపోటీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో.. నేనున్నా, నేనొస్తున్నా అంటూ కేఏ పాల్‌ స్పందించడం.. పొలి కేక వేసినట్లుగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: