చంద్రబాబుకి మంగళగిరి గిఫ్ట్ ఇస్తా: లోకేష్

Gullapally Rajesh
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన నిరసన దీక్ష నేటి తో ముగుస్తున్న నేపధ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చివరి రోజు ప్రసంగించిన లోకేష్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ఇబ్బంది పెట్టే విధంగానే నేడు గట్టిగా మాట్లాడారు. అసలు లోకేష్ ఏం అన్నారు ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే, ఏపీలో గంజాయి పరిశ్రమ బాగా నడుస్తోంది అని ఆయన ఆరోపణలు గుప్పించారు.
యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు అని ఆయన అన్నారు. యువత భవిష్యత్తుపై నిలదీస్తే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు అని లోకేష్ ఆరోపణలు చేసారు.  ఎవరూ లేని సమయంలో దాడి చేయడం సరికాదు అని లోకేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు.  దాడులు చేయాలని పోలీసులే ప్రేరేపించే పరిస్థితి ఉందని ఆయన పోలీసులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసారు.  పోలీసులు లేకుండా వైసీపీ నేతలు బయటకు రావాలి అని సవాల్ చేసారు.  కొన్ని పిల్లులు.. పులులమని భావిస్తున్నాయి అని ఆయన ఎద్దేవా చేసారు.
పసుపు జెండా చూస్తే మీకు ఎందుకంత భయం? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక చెంప మీద కొడితే.. రెండు చెంపలు వాయగొడతాం అని ఆయన హెచ్చరించారు. మా ఆఫీసులో పగిలింది అద్దాలు మాత్రమే.. మా కార్యకర్తల గుండెలను మీరు గాయపరచలేరు అని అన్నారు. రెండున్నరేళ్లు ఆగండి.. చంద్రబాబే మళ్లీ సీఎం అంటూ ధీమా వ్యక్తం చేసారు. టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడక్కర్లేదు అని అన్నారు. జగన్ రెడ్డిలా నేను చిన్నాన్న జోలికి వెళ్లలేదు అని జగన్ మగాడైతే వాళ్ల చిన్నాన్న హత్య కేసు తేల్చాలి అని డిమాండ్ చేసారు. 2024లో మంగళగిరిలో టీడీపీను గెలిపించి కానుకగా ఇస్తా అని లోకేష్ హామీ ఇచ్చారు. వైసీపీకు ట్రైలర్ మాత్రమే చూపాం అని సినిమా ముందుంది అన్నారు నారా లోకేష్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: