షర్మిల, ప్రవీణ్‌ కుమార్‌ ఫ్యూచర్ ఏంటో చెప్పేసిన రేవంత్ రెడ్డి..?

Chakravarthi Kalyan
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బహుముఖంగా మారిపోయాయి. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ద్విముఖ పోరులు చూడటమే మన ఓటర్లకు అలవాటు.. మొదట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు.. ఆ తర్వాత తెలుగుదేశం కాంగ్రెస్.. రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్.. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఇలా ద్విముఖ పోరులే అన్నీ.. ద్విముఖ పోరు అన్నంత మాత్రాన ఇతర పార్టీలు లేవని కాదు.. వారికి సీట్లు రాలేదని కాదు. కానీ.. అధికారం బదిలీ మాత్రం రెండు ప్రధాన పార్టీల మధ్యనే ఉంటోంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీటైంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ కనిపించింది. కానీ ఈసారి 2023అసెంబ్లీ ఎన్నికలు మాత్రం విచిత్రమైన పోటీ చూడబోతున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ మరోసారి గట్టి ప్రయత్నం చేస్తోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల బీజేపీ అనూహ్యంగా లాభపడింది. ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణపై ఆశలు పెట్టుకుంది. అక్కడితో కథ అయిపోలేదు.  

తెరపైకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ, బీఎస్పీ కూడా వచ్చేశాయి. తెలంగాణ రాజన్న రాజ్యం పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ సీన్‌ లోకి వస్తే.. బహుజన రాజ్యం సాధనే లక్ష్యమంటూ బీఎస్సీ ప్రవీణ్‌ కుమార్ నాయకత్వంలో ముందుకొచ్చింది. ఈ రెండు పార్టీల ప్రభావంపై అప్పుడే ఓ అంచనాకు రాలేకపోతున్నారు విశ్లేషకులు. అయితే.. ఈ రెండు పార్టీలు జనంపై ఏమాత్రం ప్రభావం చూపలేవని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు.

వైఎస్‌ షర్మిల పార్టీ, ప్రవీణ్‌ కుమార్ బీఎస్సీ పొత్తు పెట్టుకుంటాయని ఊహాగానాలు వస్తున్నాయి.దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. షర్మిల పార్టీ, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ.. ఈ రెండు కలిసినా.. 2014లో వైఎస్సార్ సీపీ సాధించిన ఓట్లు కూడా సాధించలేవని రేవంత్ రెడ్డి అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: