భారత్ లో ఆకలి కేకలు.. పాకిస్తాన్ కంటే దయనీయ పరిస్థితులు..

Deekshitha Reddy
భారత్ లో ఆకలి కేకలు పెరిగిపోయాయా..? పేదలకు పట్టెడన్నం దొరికే రోజులు కూడా కనుమరుగయ్యాయా..? ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రం ఘోరంగానే ఉన్నాయి. ప్రపంచ ఆకలి సూచిక అసలేం చెబుతోంది..? ప్రపంచ ఆకలి సూచిక లెక్కల ప్రకారం భారతదేశం ఇప్పుడు ఘోర పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత ఏడాది ఈ సూచికలో 94 వ స్థానంలో ఉన్న భారతదేశం, ప్రస్తుతం 101 స్థానానికి వచ్చి చేరింది. దీనిని బట్టి చూస్తే భారతదేశంలో ఆకలితో ఎంతమంది అల్లాడిపోతున్నారో స్పష్టమవుతుందంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పేదల ఆకలి తీర్చడంలో భారతదేశం.. బంగ్లాదేశ్, నేపాల్ కంటే వెనుకబడిందంటూ ఆరోపిస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం.. హంగర్ ఇండెక్స్ కు అసలు శాస్త్రీయతే లేదని చెబుతోంది. అవన్నీ తప్పుడు లెక్కలేనని.. ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటోంది. అధికార పక్షం సమర్థింపులు, ప్రతిపక్షాల ఆరోపణలను అటుంచితే.. అసలు నిజంగానే భారతదేశంలో పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగానే కనిపిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో దాదాపుగా సంవత్సరకాలం పాటూ పేదలకోసం రేషన్ షాపుల ద్వారా కేంద్రం, బియ్యం పంపిణీ చేసింది. ఒక్కొక్కరికి ఐదు కేజీల వంతున ఉచితంగా సరఫరా చేసినప్పటికీ.. ఈ పథకాలన్నీ పేదల ఆకలిమంటలను తీర్చలేకపోయాయి.
ప్రపంచ ఆకలి సూచిక లెక్కలను ఒక్కసారి పరిశీలిస్తే ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్.. కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇలా ఆంక్షలు విధించడంతో చాలా మంది నిరుపేదలు అల్లాడిపోయారు. లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయి.. రోడ్డున పడ్డారు. ఇప్పటికీ చాలామంది ఉద్యోగాలు కోల్పోయి.. చాలీచాలని ఆదాయంతో  దొరికిన పని చేస్తూ.. పొట్టనింపుకునేందుకు అవస్థలు పడుతున్నారు. లాక్ డౌన్ అనంతరం కూడా పేదలకు ప్రోత్సాహకాలు ప్రకటించడంలో ప్రభుత్వం అంతగా సఫలీకృతం కావడం లేదు. దీంతో మన దేశంలో పేద, ధనిక అంతరాలు బాగా పెరిగిపోతున్నాయి. హంగర్ ఇండెక్స్ కి శాస్త్రీయత ఉన్నా లేకపోయినా.. ఆ సూచికలో భారత్ స్థానం మాత్రం డేంజర్ బెల్ మోగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: