ఎలక్షన్ టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ కసరత్తు..!

Podili Ravindranath
దాదాపు 140 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుస పరాజయాలు... కీలక నేతల పార్టీ మార్పులు... సీనియర్ నేతల ఆరోపణలు.. నాయకత్వ లోపం... ఇలా ఎన్నో అంశాలు హస్తం పార్టీని పట్టి పీడిస్తున్నాయి. ఇక పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇబ్బంది కరంగానే ఉంది. ముఖ్య నేతల మధ్య అంతర్గత పోరు... సీనియర్, జూనియర్ నేతల మధ్య విభేదాలు... ఇలా వరుస సమస్యలు పార్టీని ముందుకు పోనివ్వటం లేదు. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ వయోభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు పార్టీ ముఖ్య నేతలు కూడా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ నాయకత్వంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఈ రోజు జరగనుంది. ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు.
కరోనా వైరస్ వచ్చిన నాటి నుంచి దాదాపు అన్ని సమావేశాలు కూడా ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. అయితే దాదాపు 18 నెలల తర్వాత మొదటిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా... ఆఫ్ లైన్ విధానంలో నేరుగా సమావేశం కానున్నారు. 18 నెలల తర్వాత జరుగుతున్న సమావేశంలో.... దేశంలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించనున్నారు నేతలు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఈ సమావేషంలోనే ఖరారు చేయనున్నారు. వీటితో పాటు వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించాల్సి వ్యూహాలు, అభ్యర్థుల ఖరారుపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఇక లఖింపూర్ ఖేరీ ఘటనలో పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక, రాహుల్ గాంధీలపై యూపీ సర్కార్ వ్యవహరించిన తీరుపై కూడా చర్చించనున్నారు. 2019 జులై 3వ తేదీన లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో... పార్టీలో జీ 23గా పేర్కొన్న నేతలు రాసిన బహిరంగ లేఖలో లేవనెత్తిన సమస్యలపై కూడా పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

CWC

సంబంధిత వార్తలు: