అయోధ్య రాముని దర్శనంపై భక్తులకు శుభవార్త...!

Podili Ravindranath
రాములోరి భక్తులకు శుభవార్త. అయోధ్యలోని రామ జన్మభూమి ప్రాంతంలోని ఆలయ నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు ట్రస్ట్ సభ్యులు. అయోధ్య ఆలయంలోని రాముల వారి దర్శన భాగ్యం డిసెంబర్ నెల 2023 నుంచి ఉంటుందని ప్రకటించారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్న చంపత్ రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయని వెల్లడించారు చంపత్ రాయ్. ఆలయ గర్భగుడిలో రాముల వారి విగ్రహాన్ని 2023 నాటికి ప్రతిష్టిస్తామన్నారు చంపత్ రాయ్. విగ్రహ ప్రతిష్థపై ఇప్పటికే సాధువుల కమిటీతో చర్చలు జరిపినట్లు రాయ్ తెలిపారు. ఇప్పటికే తొలి దశ పునాది పూర్తయ్యాయని తెలిపారు. మరో నెల రోజుల్లో రెండో దశ పునాది పనులు కూడా పూర్తి చేస్తామన్నారు చంపత్ రాయ్. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తొలి దశ పునాది పనులు పూర్తయ్యాయని.... డిసెంబర్ నెల నుంచి ప్రధాన ఆలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.
పునాది పనుల అనంతరం... ఆలయ మొదటి అంతస్తు పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికే పిల్లర్లకు సంబంధించిన పనులు పూర్తి కావస్తున్నాయన్నారు. ప్రస్తుతం కాంక్రీట్ పనులు జరుగుతున్నాయన్న రాయ్... కేవలం రాత్రి పూట మాత్రమే పనులు నిర్వహిస్తున్నామన్నారు. కాంక్రీట్ పనులను 23 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నిర్వహించాలని నిపుణులు సూచించారని... అందుకోసమే రాత్రి పూట మాత్రమే కాంక్రీట్ పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఇంజినీర్ల సూచన మేరకు ఉష్ణోగ్రత కోసం ఐస్ క్యూబ్స్ వినియోగిస్తున్నామన్నారు. గతేడాతి ఆగస్టు నెలలో దేశ  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించారు. దాదాపు 2 వేల కోట్ల రూపాయల పైగా విరాళాలు రామ జన్మ భూమి ట్రస్ట్ ఖాతాలో చేరాయి. ప్రస్తుతం పనులు శరవేగంతో జరుగుతున్నాయని నిపుణులు వెల్లడించారు. ఆలయ నిర్మాణం కోసం సాధువులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది రామ్ తీర్థ క్షేత్ర ట్రస్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: