వినుకొండ వైసీపీలో అసమ్మతి సెగ!

N.Hari
గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. నియోజకవర్గం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై అసమ్మతి వర్గం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఆయన గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేసినవారు అసమ్మతి దారి పట్టారు. తాాగా ఇటీవల౩గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీరుకు వ్యతిరేకంగా సమావేశం కావడం వాడివేడి చర్చకు దారితీసింది. తనకు వ్యతిరేకంగా రోజురోజుకు అధికమవుతున్న అసమ్మతి గళం.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. ఆయన వ్యవహారశైలి అని, అదే పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తోందని పార్టీ నాయకులు, కార్యకర్తల అంతర్గత సమావేశంలో చెవులు కొరుక్కుంటున్నారు.
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి మాట కటువుగా ఉందనీ, ఎవరు రాజకీయంగా ఎదిగినా ఓర్చుకోలేని విధంగా ఆయన ప్రవర్తన ఉందనీ సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడుగా పని చేసిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు కూడా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహార శైలీతో ఇప్పటికే దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా తనకు తాను సొంతంగా తన క్యాడర్‌ను కాపాడుకునే పనిలో ముందుకు సాగుతున్నారు. తాజాగా నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశం కావడం చర్చకు దారితీసింది.
వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలంలో కొన్ని రోజులుగా అంతర్గతంగా మదనపడుతున్న నాయకులు తాజాగా అసమ్మతి గళాన్ని ఎత్తుకున్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మండల నాయకుల తీరుపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఇటీవల గెలుపొందిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ గ్రామాలకు చెందిన 70 మంది పార్టీ నాయకులు రవ్వవరం కొండ గురునాథస్వామి కొండ వద్ద సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అండతో మండలంలోని ఇద్దరు నాయకులు వల్ల కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలపై చర్చించుకున్నారు.
ఎమ్మెల్యే బొల్లాకు మండలంలోని నాయకులు, ప్రజల సమస్యలను తెలియజేసే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తమ మాటకు విలువ లేకుండా పోయిందని వాపోయారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు లేకుంటే పార్టీ మనుగడే కష్టం అవుతుందని హెచ్చరించారు. ఇంత మంది ప్రజా ప్రతినిధులు అసమ్మతి సమావేశం ఏర్పాటు చేయడం నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: