కేసీఆర్ ప్లేస్‌లోకి కేటీఆర్‌..?

Paloji Vinay
ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి సంబంధించిన ఎన్నిక‌ల షెడ్యూల్ ను 17 వ తేదిన విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు కేసీఆర్ ఆదేశాల మేర‌కు పార్టీ సంస్థ‌గ‌త నిర్మాణ ప్ర‌క్రియ క్షేత్ర స్థాయి నుంచి ప‌ట్ట‌ణ స్థాయి వ‌ర‌కు క‌మిటీల నియామ‌కం పూర్తయింది. పార్టి విధి విధానాల ప్ర‌కారం ప్ర‌తి రెండేళ్లకు ఒక‌సారి పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు.

   ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి  ఏప్రిల్ 27న పార్టీ అధ్య‌క్షుడిని ఎన్నుకుంటారు. కానీ 2019లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కార‌ణంగా, 2020-2021 లో క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా పార్టీ ప్లీన‌రి నిర్వహించ‌లేదు.  ప్ర‌స్తుతం దేశంలోని  ఇత‌ర రాష్ట్రాల్లో కంటే తెలంగాణ‌లో క‌రోనా తీవ్ర‌త కాస్త త‌క్కువ‌గానే ఉంద‌ని తెలుస్తోంది. వ్యాక్సినేష‌న్ కూడా వేగంగా సాగుతోంది. నెల రోజుల్లో 100 శాతం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్తి కానుంది. ఈ క్ర‌మంలో పార్టీ అధ్య‌క్ష ఎన్నిక నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. న‌గ‌రంలోని హెచ్ఐసీఐ ప్రాంగ‌ణంలో అక్టోబ‌ర్ 25వ తేదిన పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి అధ్య‌క్షుని ఎన్నుకుంటామ‌ని కేటీఆర్ తెలిపారు.

  అయితే, ఈ సారి ఎవ‌రు అధ్య‌క్షుడు అవుతార‌నేది కీల‌కంగా మారింది.2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పురుడుపోసుకుంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 20 ఏళ్ల‌పాటు పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ కొన‌సాగుతున్నాడు. ఓ ప్రాంతీయ పార్టీగా 20 ఏళ్ల‌పాటు ఒకే వ్య‌క్తి అధ్య‌క్షుడిగా కొన‌సాగ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఈ సారి మ‌ళ్లీ అధ్య‌క్షుడిగా కేసీఆర్ నే కొన‌సాగిస్తారా లేదా మారుస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. ఈ సారి పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విలో కేటీఆర్ కూర్చోబోతున్నాడ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  కేటీఆర్ కాకుండా ఇంకెవ‌రు అధ్య‌క్ష స్థానానికి అర్హులు అనే విష‌యం కూడా తేల‌నుంది. మ‌రి చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: