మంత్రి ప‌ద‌వి కోసం : జ‌గ‌న్ న‌గ‌రిలో రోజా!

RATNA KISHORE
న‌గ‌రి రోజా కు మంచి రోజులే రానున్నాయి. క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో ఈ సారి ఆమెకో స్థానం ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌తో సీఎం ఉండ‌గా, ఆయ‌న‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో రోజా ఉన్నారు. ప‌దవి ఉన్నా,లేకున్నా క్లిష్ట స‌మయాల్లో పార్టీకి అండ‌గా ఉండ‌డంలో రోజా ఎన్నడూ ముందున్నారు. సినిమాల ప‌రంగా పూర్తిగా ప్రాధాన్యం త‌గ్గించి, రాజ‌కీయాల్లోనే రోజా బిజీ అయి ఉన్నారు. కొన్ని అవ‌కాశాలు వ‌చ్చినా కాద‌నుకున్నారు. రీ ఎంట్రీ మాట కూడా వినిపించినా అలాంటి ఉద్దేశాలేవీ త‌న‌కు లేవ‌నే తేల్చారు.

కొత్త మంత్రి వ‌ర్గం ఏర్పాటుకు సంబంధించి జ‌గ‌న్ త‌న‌దైన పంథాను అనుస‌రిస్తున్నారు. క్యాస్ట్ ఈక్వేష‌న్స్ కు భ‌లే ప్రాధాన్యం ఇస్తు న్నారు. త‌న విధేయురాలు, సోద‌రి రోజాకు ప‌ద‌వి ఇవ్వాల‌న్న‌ది ఆయ‌న యోచ‌న. మొద‌టి విడ‌త మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌ద‌వి రాలేద‌న్న కోపం, దుఃఖం, నిరాశ‌లో ఉన్న రోజా సెల్వ‌మ‌ణి ఈ సారి మాత్రం త‌న‌కు బెర్తు ఖాయ‌మ‌న్న హ‌డావుడిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే బ్ర‌హ్మోత్స‌వ వేళ సీఎంను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపారు. రేణిగుంట విమాన‌శ్ర‌యంలో జ‌గ‌న్ ను ఆహ్వానించేందుకు వ‌చ్చిన రోజా ఆయ‌న‌కు ఓ ప్ర‌త్యేక శాలువాను అందించారు. దీనిపై వైఎస్ బొమ్మ‌ను, జ‌గ‌న్ బొమ్మ‌ను, పార్టీ సింబ‌ల్ ఫ్యాన్ గుర్తును ముద్రింప‌జేశారు. ఇది చూసి సీఎం చాలా ఆనందించారు కూడా! అంతేకాదు త‌న క్యాబినెట్ లో మ‌హిళా మంత్రులుగా వ‌చ్చేవారంతా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కూడా బాగా సిద్ధం కావాల‌ని సూచిస్తున్నారు.


పార్టీ వాయిస్ వినిపించే వారిలో విడుద‌ల ర‌జ‌నీతో పాటు  రోజా కూడా ఉన్నారు. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు బాబు అండ్ కో ని అసెంబ్లీలో అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసి, వైసీపీ విధేయురాలిగా మంచి పేరు తెచ్చుకున్న రోజా త‌రువాత కాలంలో న‌గ‌రి ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ, ఏపీఐసీసీ ప‌ద‌వితోనే స‌రిపెట్టుకుని తీరాల్సి వ‌చ్చింది. ఈ తరుణాన రోజాకు మంత్రి  ప‌ద‌వి ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచ‌న‌లో సీఎం ఉన్నారు. గ‌త కొద్దికాలంగా పెద్దిరెడ్డితో త‌గాదాల కార‌ణంగా ఎన్నో అవ‌మానాలు చ‌విచూసిన రోజా, త‌న సొంత జిల్లా (చిత్తూరు)లో క్రియాశీల‌కంగా రాణించ‌లేక చ‌తికిల‌ప‌డ్డారు. స్థానిక ఎన్నిక‌ల్లో కూడా త‌న మాట‌ను నెగ్గించుకోలేక‌పోయారు. పెద్దిరెడ్డి లాంటి నాయ‌కుల‌కు ఎదురు చెప్ప‌లేక ఎన్నో అవ‌మానాలు అందుకున్నారు. ఈ నేప‌థ్యంలో రోజా కు మంత్రి ప‌దవి ఇస్తే పార్టీకి మైలేజీ పెర‌గ‌డ‌డంతో పాటు విధేయ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చినవారం అవుతామ‌ని సీఎం భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: