చిన్నారుల కోసం టీకా వచ్చేసిందోచ్..!

NAGARJUNA NAKKA
దేశంలో 12ఏళ్లు పైబడిన పిల్లల కోసం ఉద్దేశించిన జైకోవ్-డీ టీకా ఈ నెల 20నుంచి అందుబాటులోకి రానుంది. ఇది దేశంలోనే పిల్లల కోసం అనుమతి పొందిన మొదటి టీకా. ప్రాథమిక దశలో నెలకు కోటి డోసుల ఉత్పత్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు. టీకాల రవాణా, నిల్వకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. అయితే మొత్తం టీకాల్లో 25శాతం టీకాలను ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించనున్నారు.
ఇక స్పుత్నిక్-లైట్ సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ ను రష్యాకు ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్ రెండు డోసుల టీకాకు భారత్ లో అనుమతి ఉండగా.. సింగిల్ డోసు వినియోగానికి ఇంకా అనుమతి లేదు. దీంతో భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చే వరకూ ఎగుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. కాగా ఆర్ డీఐఎఫ్ ద్వారా హెటెరో బయోఫార్మా ఈ వ్యాక్సిన్ ను భారత్ లో ఉత్పత్తి చేస్తోంది.
మరోవైపు కరోనా కట్టడికి తాము తయారు చేసిన ఔషధానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మెర్క్ ఫార్మా సంస్థ యూఎస్ఎఫ్ డీఏకు దరఖాస్తు చేసుకుంది. వైరస్ సోకిన వారికి ఉపశమనం కల్గించడంలో ఈ ఔషధం బాగా పనిచేస్తోందని వివరించింది. దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభమని పేర్కొంది.
రోగనిరోధక శక్తి లేని వారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో డోస్ పెంచాలని డబ్ల్యూహెచ్ ఓ వ్యాక్సిన్ సలహాదారు సిఫార్సు చేస్తున్నారు. 60ఏళ్లు దాటిన వారికి థర్డ్ సినో ఫార్మ్, సినోవాక్ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిపుణులు సూచించారు. అయితే అధిక సంఖ్యలో ఉన్న జనాభాకు ఎక్స్ డ్రా డోస్ ను సిఫార్సు చేయడం లేదని నిపుణులు స్పష్టం చేశారు.
మరోవైపు దేశంలో పండుగల సీజన్ నడుస్తుండగా.. ఈ సమయంలోఎక్కువ మంది ప్రజలు మాస్కులు, భౌతిక దూరం లాంటి కరోనా జాగ్రత్తలను పట్టించుకోవడం లేదని తేలింది. దేశంలోని 366 జిల్లాల్లో లోకల్ సర్కిల్స్ అనే డిజిటల్ కమ్యూనిటీ ఈ సర్వే నిర్వహించగా.. ప్రయాణాలు, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారంది. పండుగల కారణంగా.. సామాజిక ,మతపరమైన కార్యక్రమాలతో పాటు షాపింగ్ లాంటివి విపరీతంగా పెరిగాయంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: