చివరకు రోజా మాటే నెగ్గింది..!

N.Hari
చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నిండ్ర మండలంలో వాయిదా పడ్డ ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక్కడ చివరకు ఎమ్మెల్యే రోజా మాటే నెగ్గింది. తన వర్గానికి చెందిన ఎలకాటూరు ఎంపీటీసీ సభ్యురాలు దీపను ఎంపీపీగా ఎన్నికయ్యేలా ఆమె చక్రం తిప్పారు. అలాగే వైస్‌ ఎంపీపీగా దుర్గాభవానీని ఎన్నుకునేలా చేశారు. మండలంలోని ఎంపీటీసీ సభ్యులు అందరూ వారిద్దరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో తీవ్ర గందరగోళం, ఉత్కంఠకు దారితీసిన నిండ్ర ఎంపీపీ ఎన్నిక చివరకు సుఖాంతం కావడంతో వైసీపీ జిల్లా నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.
నిజానికి నిండ్ర ఎంపీపీ ఎన్నిక గతనెల 24న జరగాల్సి ఉండగా.. పలు కారణాలతో మరుసటి రోజుకి వాయిదా పడింది. గతనెల 25న నిర్వహించిన ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. దీంతో అక్టోబరు 8వ తేదీన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికను నిర్వహించాలంటూ ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఈనెల ఒకటో తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీంతో ఇవాళ శుక్రవారం నిండ్రలో ఎన్నికలు నిర్వహించి పూర్తి చేశారు.
అయితే గత నెల 25వ తేదీన నిండ్ర ఎంపీపీ ఎన్నిక విషయంలో ఎమ్మెల్యే రోజా, శ్రీశైలం ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి వర్గాల నడుమ తీవ్ర విభేదాల తలెత్తాయి. ఒక స్థాయిలో చక్రపాణి రెడ్డి రోజాకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని కూడా సవాలు విసిరారు. నిండ్ర మండలంలో మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి సోదరుడి కుమారుడైన చక్రపాణిరెడ్డి వైసీపీలో బలమైన నేతగా ఉన్నారు. ఇక్కడ జరిగిన మండల పరిషత్‌ ఎన్నికల్లో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఏడు వైసీపీకి, ఒకటి టీడీపీకి దక్కాయి. అయితే వైసీపీ ఎంపీటీసీలు ఏడుగురిలో ఐదుగురు చక్రపాణిరెడ్డి వర్గీయులు, మిగిలిన ఇద్దరూ ఎమ్మెల్యే రోజా వర్గీయులు. ఎంపీపీ అభ్యర్థిని నిర్ణయించే విషయంలో ఈ వర్గాల నడుమ సయోధ్య కుదరలేదు. ఇరువర్గాలూ పట్టుదలకు పోయాయి. రోజా తాను ఎమ్మెల్యే కనుక తాను నిర్ణయించిన అభ్యర్థే ఎంపీపీగా ఎన్నిక కావాలని పట్టుబట్టారు. మరోవైపు మెజారిటీ ఎంపీటీసీలు తమ వర్గీయులు కాబట్టి తాము సూచించిన అభ్యర్థే ఎంపీపీ కావాలని చక్రపాణిరెడ్డి భీష్మించుకున్నారు. ఈ గొడవతో అప్పుడు ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది.
గతనెల 26న ఎమ్మెల్యే రోజా తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డిని కలిసి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన చక్రపాణిరెడ్డి, ఆయన మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా చక్రపాణిరెడ్డి వర్గం మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిల ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. అయితే చివరికి ఈ పంచాయతీ అధిష్ఠానం వద్దకు వెళ్లింది. పార్టీ విధానం మేరకు ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థినే ఎంపీపీగా ఎన్నుకోవాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో ఇవాళ శుక్రవారం నిండ్ర ఎంపీపీ ఎన్నికలు ముగిశాయి. అయితే అధిష్టానం ఆదేశాలతో మెత్తబడిన చక్రపాణిరెడ్డి తాత్కాలికంగా సర్దుకుపోయినా.. మున్ముందు ఎలా వ్యవహరిస్తారన్నది మాత్రం నియోజకవర్గ వైసీపీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: