యోగీ సర్కార్‌కు కోలుకోలేని దెబ్బ..!

Podili Ravindranath
సరిగ్గా ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనగా... ఉత్తర ప్రదేశ్ ‌రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లుగా ఉంది. అసలే అంతంత మాత్రపు ప్రజాదరణతో ఉన్న యోగీ సర్కార్‌కు ప్రస్తుత లఖింపూర్ ఖేరి ఘటన... మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మారింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే... కేంద్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుందనేది అందరి నమ్మకం. అందుకే అన్ని ప్రధాన పార్టీలు కూడా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. ఇప్పటికే యూపీ అభివృద్ధి పేరుతో.. మోదీ సర్కార్ దాదాపు 22 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే యూపీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేరు ప్రచారంలో ఉంది కూడా.
అయితే ఇప్పుడు లఖింపూర్ ఖేరి ఘటన భారతీయ జనతా పార్టీ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేసినట్లుగా ఉంది. రైతులపై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పర్యటనలో జరిగిన దాడి... దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే యూపీలో అధికారంలో ఉన్న యోగీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కరోనా సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో... లఖింపూర్ ఖేరి ఘటన... టెరాయ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. రైతులపై దాష్టికం చేయడంపై విపక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా ప్రియాంకా గాంధీని పోలీసులు నిర్భందించారు. ఇక మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు. దీంతో ఈ ఆరు జిల్లాలో కూడా బీజేపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయినట్లుగా ఉంది. ప్రస్తుతం టెరాయ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలో పరిస్థితులు అదుపు తప్పేలా ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: