తెలంగాణాలో వ్యాక్సినేషన్ లెక్క ఇదే...?

Gullapally Rajesh
కాసేపటి క్రితం తెలంగాణా సిఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం మొదలయింది. ముందు రాష్ట్రంలో కరోనా పరిస్థితి గురించి మంత్రులు చర్చించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కెబినెట్ ఆరా తీసి... దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న కరోనా పరిస్థితికి సంబంధించి వైద్య అధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకుంది. ఇక రాష్ట్రాల్లో కరోనాకు సంబంధించి తీసుకునే చర్యలను కూడా సిఎం కేసీఆర్ మంత్రుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కూడా అధికారులు కేబినేట్ దృష్టికి తెచ్చారు.
స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తరువాత కరోనా కేసులలో పెరుగుదల లేదని కేసీఆర్ కు వివరించారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో వున్నాయని అధికారులు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళారు. 2 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని, ఇప్పటివరకు 2 కోట్ల, 56 వేల 159 డోసులు అందించారని వారిలో 1 కోటి 45 లక్షల 19 వేల 909 మొదటి డోసు, 55 లక్షల 36 వేల 250 మంది రెండు డోసులు ఇవ్వటం జరిగిందని వారు తెలిపారు.    స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుండి ప్రారంభమవుతుందని అధికారులు వివరించారు.
ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లోని పంచాయతి మున్సిపల్ అధికారులు, సర్పంచులు, ఎంపిటీసిలు, జడ్పిటీసిలు, ఎంపిపి, జడ్పీ చైర్ పర్సన్, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు తదితిర ప్రజాప్రతినిధులు క్రీయాశీలకంగా వ్యవహరించాలని కేబినేట్ సూచనలు చేసింది. అలాగే మంత్రులందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయం సాధించే విధంగా చూడాలని... ప్రతిరోజు 3 లక్షల వరకు టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరించాలని ఆదేశించారు. కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ అండ్ బి, వైద్యారోగ్య శాఖను కెబినెట్ ఈ సందర్భంగా ఆదేశించింది. హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాటుపై కెబినెట్ సమీక్ష జరిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: