తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజ‌కీయం మొద‌లైంది...!

VUYYURU SUBHASH
ఈ మధ్యనే మహారాష్ట్రలో  కేంద్ర  మంత్రి నారాయణ రాణేను పోలీసులు అరెస్ట్ చేసారు. దానికి కారణం ఆయన నోరు చేసిన చేటే. ఏకంగా ముఖ్యమంత్రి సీటులో ఉన్న ఉద్ధవ్ థాకరేను పట్టుకుని చెంప పగలగొడతాను అంటూ రెచ్చిపోయారు. సరే ఆయనది బీజేపీ పార్టీ, అక్కడ అధికారంలో ఉన్నది శివసేన పార్టీ. రెండింటి మధ్యన పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. దాంతో మాటల తూటాలు గట్టిగానే పేలుతాయి. దీంతో రాణే దాన్ని మరింతగా పదును పెట్టారు. దెబ్బకు ఆయన్ని అరెస్ట్ చేయడం ద్వారా మహా సర్కార్ కొత్త ట్రెండి కి తెర తీసింది.
ఈ దేశాన ఇప్పటిదాకా విపక్ష నేతలు ఏం మాట్లాడినా చెల్లిపోయేది. కానీ మహా రాష్ట్రలో రాణే ఎపిసోడ్ తో దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. విపక్షాలు హద్దు దాటితే జైలు దారి చూపిస్తామని కూడా అంటున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయితే రాజకీయాలు ఎపుడూ హాట్ హాట్ గా సాగుతాయి. నువ్వా నేనా అన్నట్లుగానే కధ ఉంటుంది. ఈ నేపధ్యంలో రాణే అరెస్ట్ ని ఉదహరిస్తూ తెలంగాణా మంత్రి కేటీయార్ తాజాగా  మాట్లాడుతూ  అక్కడ  ఏకంగా కేంద్ర మంత్రినే అరెస్ట్ చేశారని గుర్తు చేశారు.
ఇక  తెలంగాణాలోనూ విపక్షాలు హద్దులు దాటుతున్నాయని చెప్పుకొచ్చారు. అంటే ఏమైనా ఎక్కువ మాట్లాడితే అక్కడ కూడా  అరెస్టులు తప్పవన్న హింట్ ఇచ్చారు. ఇక ఏపీలో చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్ మీద విపక్షాలు గట్టిగానే నోరు చేసుకుంటున్నాయి. ఇక టీడీపీ అయితే ఏనాడో హద్దులు దాటేసింది. లోకేష్ గాలిగాడు అంటూ జగన్ మీద దారుణమైన భాషనే ఉపయోగిస్తున్నారు. మరో వైపు వైసీపీ మంత్రి కన్నబాబు లోకేష్ భాష మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ఎలా అంటున్నారు. రెచ్చగొట్టే భాష వాడితే ఊరుకోమని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు.
మరి అక్కడ రేవంత్ రెడ్డి కూడా కేసీయార్ ని పట్టుకుని ఎక్కువగానే విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ లోకేష్ దీ అదే దారిలా ఉంది. మరి నారాయణ రాణే అరెస్ట్ కళ్ళ ముందు కదులుతున్న వేళ అధికార పార్టీలు ఎంతవరకూ ఈ దుర్భాషను సహించి ఊరుకుంటాయి అన్నది కూడా చూడాలి. ఒకవేళ ఇక్కడ కూడా విపక్ష నేతలను అరెస్ట్ చేస్తే మాత్రం తెలుగు రాజకీయ హీట్ వేసవి వేడిని మించిపోవడం ఖాయమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: