కేటీఆర్ మార్క్ పాలిటిక్స్..!

Podili Ravindranath
కేటీఆర్‌ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన త‌రువాత గులాబీ నేత‌ల‌కు పెద్దఎత్తున పార్టీ ప‌ద‌వులు దక్కుతుండ‌డంతో నేత‌ల్లో తీవ్ర పోటీ నెల‌కొంది.  నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే తీసుకునే నిర్ణయ‌మే ఫైన‌ల్ అంటూ గ‌తంలో పార్టీ హైక‌మాండ్ నేత‌ల‌కు స్పష్టమైన సూచ‌న‌లు చేసింది. కానీ... సంస్థాగ‌త నిర్మాణంలో భాగంగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల మధ్య ఉన్న ఆధిప‌త్య పోరు తెర‌పైకి వ‌చ్చింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌రెడ్డి ఎవరికి వారే గ్రామాల్లో రెండు క‌మిటీల‌ను నియమించారు. దీంతో ఇలాంటి నియోజ‌క‌ర్గాల‌పై ఆరా తీసిన పార్టీ హైక‌మాండ్- ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని చక్కదిద్దేందుకు చ‌ర్యలు చేప‌ట్టింది. ఇటీవ‌ల పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన స‌మీక్షలో ప్రధానంగా ఇదే అంశం చ‌ర్చకు  వ‌చ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌లు స‌జావుగానే సాగినా..... గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ అభ్యర్థులుగా బ‌రిలో దిగి ఓట‌మి చెందిన నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించిన ఇత‌ర పార్టీల నేత‌లు అధికార పార్టీ గూటికి చేరుకున్నారు. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇద్దరు నేత‌ల  మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.  నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కోసం పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా  మాజీలు  పావులు క‌దిపారు. తాండూరు, కొల్లాపూర్, పాలేరు, న‌కిరేక‌ల్, మ‌హేశ్వరం వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌మిటీల ఏర్పాటు సంద‌ర్భంగా  ఆధిప‌త్య పోరు మ‌రోసారి తెరపైకి వ‌చ్చింది. తాండూరులో ఇద్దరు నేత‌లు వేర్వేరుగా క‌మిటీలు నియ‌మించ‌డంతో... ఆ పంచాయ‌తీ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ముందుకు వ‌చ్చింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌తో భేటీ అయిన కేటిఆర్ - ప‌లు అంశాల‌పై  ఇదే స‌మావేశంలో స్పష్టమైన సూచ‌న‌లు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేలు నియ‌మించిన క‌మిటీలనే అధికారికంగా గుర్తి స్తామ‌ని తేల్చి చెప్పారు. స‌మ‌న్వయ క‌ర్తగా ఎంపీ రంజిత్ రెడ్డిని నియ‌మించి క‌మిటీల‌ను ఫైన‌ల్ చేశారు. ఇదే స‌మ‌యంలో మాజీమంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఎదురైన సంఘ‌ట‌న‌ల‌ను వివ‌రించారు. అయితే.... మ‌రోసారి ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని కేటిఆర్  హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.
నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కార‌ణంగా క‌మిటీల నియామ‌కం పార్టీ విధించిన డెడ్ లైన్ లోపు పూర్తి కాలేద‌ు. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గాలకు  రెండు, మూడు రోజులు గ‌డువుచ్చి క‌మిటీల నియామ‌కం పూర్తి చేయాల‌ని పార్టీ ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: