ఏపీలో సర్కారు వారి చేపలు..!

Podili Ravindranath
చేపల మార్కెట్లు.. ఈ పేరు వినగానే అందరికీ అపరిశుభ్ర వాతావరణం, అమ్మకందారులు, కొనుగోలుదారుల రద్దీతో గందరగోళం గుర్తుకు వస్తుంది. నగరాలు, పట్టణాల్లో పరిమితంగా మార్కెట్లు ఉన్నా.. వాటిలో ఈగులు, దోమలు, పురుగులు వాలుతుంటాయి. గ్రామాల్లో రోడ్ల పక్కన విక్రయాలు జరుగుతాయి.  వ్యర్థాలతో ఆ చట్టుపక్కల వారికి దుర్వాస వ్యాపిస్తుంది. వీధుల్లో అమ్మే చేపలు ఎంత నాణ్యమైనవో చెప్పాల్సి పనిలేదు. ఇకపై అలాంటి పరిస్థితులకు ఆస్కారం లేకుండా పరిశుభ్రమైన వాతారణంలో మత్స్య ఉత్పత్తుల అమ్మకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరసమైన ధరలకు నాణ్యమైన చేపలు, రొయ్యలు, పీతలను విక్రయించేందుకు ఫిష్‌ ఆంధ్రా పేరిట అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది ఏపీ సర్కార్‌.  
రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం బీసీ రోడ్డులో మినీ చేపల మార్కెట్‌  ప్రారంభమైంది. త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సముద్రంలో పెరిగే వంజరం, చందువా, రొయ్యలు, పీతలు, పండుగప్ప.. చెరువుల్లో పెంచే శీలావతి, బొచ్చె, రూప్‌చంద్, మోసు, కొర్రమీను, రాగండి, కాట్లా వంటి చేపల రకాలను ఈ అవుట్‌ లెట్లకు సరఫరా చేస్తుంది.
కరోనా మహమ్మారి చేపలు, రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతులు తగ్గిపోయాయి. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులకు తీవ్రంగా నష్టం వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. ఇటు పెంపకందారులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అటు వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించే విధంగా ఫిష్‌ ఆంధ్ర మినీ అవుట్‌ లెట్లను అందుబాటులోకి తెస్తోంది. ఎక్కడ చేపలను అక్కడే అమ్మే విధానానికి మత్స్య శాఖ  శ్రీకారం చుట్టింది.  నగరాల్లో  స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి.. అక్కడ నుంచి అవుట్‌ లెట్లకు సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టింది.
మత్స్య విక్రయశాలలు ఏర్పాటు చేసే వారు ముందుగా కొంత మొత్తం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 30 వేల రూపాయలు డిపాజిట్‌ చేస్తే మిగిలిన సొమ్మును బ్యాంకులు అందజేస్తాయి.  యూనిట్ కాస్ట్ లక్ష రూపాయల నుంచి 2 లక్షల వరకు ఉంటుంది.   పది నుంచి 12 అడుగుల విస్తీర్ణంలో దుకాణం ఏర్పాటువుతుంది. అలాంటి వారికి మత్స్యశాఖ ఫిష్‌ ప్రాసెసింగ్‌, నిల్వ, కటింగ్‌పై శిక్షణ ఇస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు అమ్మాల్సి ఉంటుంది. విశాఖపట్నంలో ప్రారంభించిన ఫిష్‌ ఆంధ్రా రిటైల్‌ అవుట్‌ సక్సెస్‌ను పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: