మహేశ్‌ ట్వీట్‌ పరామర్శపై హీట్‌!?

N.Hari
నిన్నటి వరకు హీరో సాయిధరమ్ యాక్సిడెంట్‌పై సినీ ప్రముఖులు మాట్లాడారు. ఇప్పుడు సైదాబాద్ చిన్నారి హత్యాచారం ఘటనపై స్పందిస్తున్నారు..! అయితే సూపర్ స్టార్ మహేశ్ వంటి వాళ్లు ఇంట్లో నుంచి ట్వీట్‌ చేసి సరిపెట్టడంపై సోషల్ మీడియాలో విమర్శల బౌన్సర్లు కురుస్తున్నాయి. సింగరేణి కాలనీలో చోటుచేసుకున్న చిన్నారి హత్యాచారం కేసు ప్రస్తుతం సినీ రంగాన్ని  కూడా కదిలిస్తోంది. ముందుగా హీరో మంచు మనోజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించాడు. చిన్నారిపై జరిగింది క్రూరత్వం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు..! ఇలాంటి ఘటనలు జరగకుండా దోషులను కఠినంగా శిక్షించాల్సిందే అని డిమాండ్ చేశాడు..! ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు ఈ టాపిక్‌పై స్పందించడం ఆరంభించారు..!
సైదాబాద్‌ ఘటనపై పవర్ స్టార్  పవన్‌ కల్యాణ్‌ కూడా రియాక్ట్‌ అయ్యాడు . ఇంటికి వెళ్లి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించాడు. సింగరేణి కాలనీ ఘటన తనను కలచి వేసిందన్నాడు. బాధిత తల్లిదండ్రులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు..! మంచు మనోజ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాధిత కుటుంబాన్ని ఇంటికి వెళ్లి పరామర్శించగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రం ట్విట్టర్ వేదికగా స్పందించాడు.  సమాజంలో మన కూతుళ్లు సురక్షితంగానే ఉంటారా..? అన్న ప్రశ్న తలెత్తుతోందన్నాడు. చిన్నారి కుటుంబానికి సరైన న్యాయం చేయాలని కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశాడు.
అయితే మహేశ్ బాబు బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి పరామర్శింకుండా.. ఇంట్లో నుంచి ట్వీట్‌తోనే సరిపెడతాడా? అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అమానుష ఘటనలపట్ల సూపర్ స్టార్ వంటి వాళ్లు ట్విట్టర్‌లో స్పందిస్తే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు..! మొత్తానికి టాలీవుడ్‌లోనూ చిన్నారి కేసు హాట్ టాపిక్‌ అవుతోంది. పలువురు ప్రముఖులు ఈ ఘటనపై స్పందన తెలుపుతున్నారు. నిందితుడు బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు అంటూ నాని ట్వీట్ చేశాడు. ఇక నిందితుడి ఆచూకీ చెబితే తన వంతుగా 50 వేలు రివార్డు ఇస్తానని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రకటించాడు. చిన్నారి హత్యాచారం ఘటనపై సినీపరిశ్రమకు చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: