మోదీ అమెరికా టూర్‌ ఎజెండా ఏటంటే...

N.Hari
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారు కావడంతో.. ఆయన విదేశీ టూర్‌ ఎజెండా ఏమిటి? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈనెల 24, 25వ తేదీల్లో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. వాషింగ్టన్‌, న్యూయార్క్‌లో జరగనున్న సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. క్వాడ్‌ నేతల సదస్సుతో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలోనూ పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నట్టు విదేశాంగశాఖ తెలిపింది. అఫ్ఘానిస్థాన్‌లో అధికారం మారిన నేపథ్యంలో మోదీ అమెరికా వెళ్లవచ్చన్న ప్రచారం జరిగింది. తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ ప్రధాని టూర్‌పై స్పష్టతనిచ్చింది. వచ్చేవారం రెండురోజుల పాటు మోదీ అమెరికా పర్యటించనున్నారు. సెప్టెంబరు 24న వాషింగ్టన్‌లో మోదీ, బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌, జపాన్ ప్రధాని హోషిహిడే సుగా మధ్య క్వాడ్‌ సదస్సు జరగనున్నది. ఆ తర్వాత సెప్టెంబరు 25న న్యూయార్క్‌ వేదికగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 76వ సెషన్‌లో జరిగే జనరల్‌ డిబేట్‌లో మోదీ పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది.
ఆరు నెలల తర్వాత మోదీ వెళుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. అంతేకాకుండా, క్వాడ్‌ దేశాల అధినేతలు ఫేస్‌ టు ఫేస్‌గా కాన్ఫరెన్స్‌లో కలుసుకుంటుండటం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మార్చిలో క్వాడ్‌ నేతల మధ్య తొలి సదస్సు జరిగినప్పటికీ కరోనా కారణంగా ఈ నలుగురు నేతలు వర్చువల్‌ విధానంలో సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనే క్వాడ్‌ దేశాలు కరోనా వ్యాక్సినేషన్‌ అంశంపై చర్చించనున్నాయి. వ్యాక్సిన్‌ చొరవకు శ్రీకారంచుట్టనున్నాయి. ఇప్పటికే ఇండియా సైతం ఆయా దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ ఎగుమతి చేసిన విషయం తెలిసిందే. కాగా భారత్‌లో సెకండ్‌ వేవ్‌ వచ్చాక కరోనా  వ్యాక్సిన్‌ ఎగుమతి కార్యక్రమానికి బ్రేక్‌ పడింది. వచ్చే క్వాడ్‌ సమావేశంలోనూ టీకా పంపిణీతో పాటు సైబర్‌, సముద్ర జలాల భద్రత, మానవతా సహకారం, వాతావరణ మార్పులపై చర్చించనున్నారు.
ఇక అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, తాలిబన్ల పాలనతో ఎదురయ్యే సవాళ్లను ప్రధానమంత్రి మోదీ చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పసిఫిక్‌-ఇండో ప్రాంతంలోని ముఖ్య సముద్ర మార్గాలపైనా దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా ఆయా సముద్ర మార్గాల అభివృద్ధికి, వాటిల్లో చైనా అధిక ప్రాబల్యాన్ని తగ్గించడానికి సరికొత్త వ్యూహ రచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్వాడ్‌ దేశాల కూటమిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: