మెట్రోకు నేనున్నా, భయం వద్దంటే వద్దంటున్న కేసీఆర్...?

Sahithya
కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో మెట్రోను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామన్నారు సిఎం కేసీఆర్. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్ అండ్ టి కంపెనీ ఉన్నతాధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో దీనిపై సిఎం కేసీఆర్ స్పందించారు. కచ్చితంగా కరోనా కష్టాలను అధిగమించి మెట్రో తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన ఎల్ అండ్ టి కంపెనీకి సంబంధించిన ఉన్నతాధికారులకు హామీ ఇచ్చారు.
మంగళవారం నాడు ప్రగతి భవన్ లో ఎల్ అండ్ టి ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కరోనా కాలంలో మెట్రో ఎదుర్కోంటున్న ఆర్థిక నష్టాలను, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీల వివరాలను సమావేశంలో చర్చించారు. అనతి కాలంలోనే సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తూ ప్రజాధరణ పొందిందని కేసీఆర్ అన్నారు. కరోనా పరిస్థితులు అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లే మెట్రోను కూడా ఇబ్బందుల్లోకి నెట్టిందని అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
దినాదినాభివృధ్ది చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మెట్రో మరింతగా విస్తరించాల్సి వుందన్నారు ఆయన.కరోనా దెబ్బతో మెట్రో అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేసారు. అన్ని రంగాలను ఆదుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి తమవంతు కృషి చేస్తుందని కేసీఆర్ తెలిపారు. ఎటువంటి విధానాలు అవలంభించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలుగుతామో విశ్లేషిస్తామని ఆయన స్పష్టం చేసారు. సాధ్యాసాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్న ఆయన... ప్రజావసరాల దృష్ట్యౌ కరోనా వంటి క్లిష్ట సందర్భాల్లో వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్ మెట్రోను ఆదుకోవడంతో పాటు తిరిగి పుంజుకుని ప్రజావసరాల దృష్ట్యా మరింతగా విస్తరించే దిశగా చర్యలు చేపడతామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: