హుజూర్ కమలంలో కలవరం మొదలైందా..?

MOHAN BABU
హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయ ఉత్కంఠకు తెర లేపుతోంది. మూడున్నర మాసాలుగా.. ఎన్నికల వేడి నియోజకవర్గంలో కొనసాగుతుండగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడం.. కనీసం మరో నెలన్నర  సమయం ఉండటంతో ఈ జాప్యం కారణంగా ఎవరికి మేలు జరుగుతుంది..? ఎవరికి నష్టం జరుగుతుంది..? అన్న చర్చలు సాగుతున్నాయి.మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్,బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరేత్తిస్తున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. హుజురాబాద్లోనే మకాం వేసి ఈటెలకు చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ జన సమూహంతో సమావేశం అవుతూ వినూత్న రీతిలో దూసుకుపోతున్నారు. అంతే దీటుగా ఈటల రాజేందర్ ప్రచారంలో దూకుడు పెంచారు. పల్లె పల్లెల్లో తిరుగుతూ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు.

అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే హుజురాబాద్ కు ఎన్నికలు లేవని ఎన్నికల సంఘం ఇచ్చిన షాక్ అన్ని రాజకీయ పార్టీలకు తగలగా, ఈసీ తాజా నిర్ణయంతో టిఆర్ఎస్, బిజెపి లో ఏ పార్టీకి లాభం చేకూరుతుంది..? ఏ పార్టీకి నష్టం జరుగుతుంది..?అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సమయం ఎక్కువ ఉంటే పట్టు సాధించే పనిలో గులాబీ దళం.. కాలయాపనతో మాకే మేలని  బిజెపి శ్రేణులు.. ఇలా ఎవరికి వారు పైకి చెబుతున్నా.. లోలోపల మాత్రం అందరికీ ఉత్కంఠ గానే ఉంది. హుజురాబాద్ పై పట్టు బిగించి క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కదుపుతూ బలగాలు మోహరించగా, మళ్లీ గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. అటు అధికార పార్టీ నుండి మంత్రులు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం జోరుగా పెంచారు. క్షేత్ర స్థాయిలో అన్ని వర్గాలను గులాబీ నేతలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని ప్రకటించి,దళిత ఓటు బ్యాంకు తమ ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు. ఇక అభివృద్ధిలోనూ హుజురాబాద్ నియోజకవర్గాన్ని జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్తున్నారు . ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కు అనుకూలంగా ఉన్న వాతావరణం, జాప్యం కారణంగా మారే అవకాశం ఉంటుందేమోనని ఆందోళన భాజపాకు చెందిన పలువురు  నాయకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: