హైదరాబాద్ నుంచి తిరుపతి ఇక చాలా దగ్గర..!

Podili Ravindranath
150 ఏళ్ల చరిత్ర కలిగిన భారతీయ రైల్వే వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తోంది మోదీ సర్కార్. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగా... మరికొన్ని తుది దశలో ఉన్నాయి. అలాంటిదే ఒకటి నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే మార్గం. సుమారు 35 ఏళ్ల క్రితం.. ఈ మార్గం కోసం ప్లానింగ్ చేశారు రైల్వే అధికారులు. అప్పటి నుంచి ఓ నాలుగు సార్లు కూడా సర్వే చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలంటే.... ఇప్పటి వరకు 4 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అందులో బీబీనగర్, సత్తెనపల్లి, గుంటూరు, బాపట్ల, ఒంగోలు మీదుగా వెళ్లే మార్గం అయితే 660 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇక రాయలసీమ మీదుగా వెళ్లే కాచీగూడ, కర్నూలు, డోన్, మదనపల్లి మార్గం అయితే 705 కిలోమీటర్లు చేయాల్సిందే. ఇక అత్యంత రద్దీగా ఉండే వరంగల్, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతి వెళ్లే రైళ్లు అయితే... ఏకంగా 735 కిలోమీటర్ల దూరం నడవాల్సిందే.
ఈ మార్గాలన్నీ కూడా దాదాపు 11 గంటలు పైగా ప్రయాణం సాగేవే. వీటన్నిటికీ ప్రత్యామ్నాయ మార్గమే నడికుడి - శ్రీకాళహస్తి మార్గం. ప్రాజెక్టు ప్రతిపాదించిన తొలి రోజుల్లో ఈ మార్గానికి మొత్తం 550 కోట్ల రూపాయలు అంచనా వేసింది రైల్వే శాఖ. అయితే పెండింగ్ పెట్టడంతో... అలా అలా సాగుతూ వచ్చింది. ఇక మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టుకు సంబంధించిన సగం ఖర్చు రాష్ట్రాలు భరించాలని సూచించింది. ఇందుకు అంగీకరించిన నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించిన రైల్వే శాఖకు బదిలీ చేసింది. 2014లో ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు మొత్తం 2,452 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఈ మార్గం ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల మీదుగానే సాగుతుంది. రైలు కూత అంటే ఏమిటో తెలియని ప్రాంతాలు కావడంతో.. ఆయా ఊర్లు కూడా అభివృద్ది చెందే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాజెక్టును శరవేగంతో పూర్తి చేస్తోంది మోదీ సర్కార్.
ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కింద న్యూ పిడుగురాళ్ల స్టేషన్ నుంచి శావల్యాపురం వరకు రైల్వే మార్గాన్ని పూర్తి చేసింది రైల్వే శాఖ. ఒకేసారి డబుల్ ట్రాక్, విద్యుదీకరణ పనులు కూడా చేసేస్తోంది. ఈ మార్గంలో ఇప్పటికే ట్రైల్ రన్ కూడా పూర్తైంది. ఇక మెయిన్ లైన్‌కు లింక్ కలిపి... రైళ్లు నడపటమే మిగిలి ఉంది. సెకండ్ ఫేజ్ కింద గుండ్లకమ్మ రైల్వేస్టేషన్ నుంచి దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు మార్గం, మూడో ఫేజ్‌లో వింజమూరు, రాపూరు, వెంకటగిరి మీదుగా శ్రీకాళహస్తి మార్గం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆయా ఫేజ్‌లలో పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అలాగే నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులకు కూడా ఈ మార్గం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. నంద్యాల, మార్కాపురం, వినుకొండ, శావల్యాపురం, పిడుగురాళ్ల, నల్గొండ మీదుగా హైదరాబాద్ సికింద్రాబాద్ చేరుకోవచ్చు. ఈ మార్గాన్ని తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జీఎం.. గజనాన్ మాల్యా... సాధ్యమైనంత త్వరలో శావల్యాపురం న్యూ పిడుగురాళ్ల మధ్య రైళ్లను నడుపుతామని వెల్లడించారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే... ఎంతో ఉపయోగంగా ఉంటుందనేది ప్రకాశం జిల్లా వాసుల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: