ఎట్టకేలకు ఏపీ సీఎం అపాయింట్‌మెంట్‌!

N.Hari
ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా.. టాలీవుడ్‌ బృందానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి దర్శనభాగ్యం దక్కనుంది. చాలారోజుల ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు ఏపీ సీఎం జగన్‌ టాలీవుడ్‌ బృందంకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం. కరోనా దెబ్బతో  సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీనికి తోడు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35.. థియేటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు శాపంగా మారింది. అయితే టిక్కెట్ రేట్లను బి, సి సెంటర్లలో నిర్ణయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఎగ్జిబిటర్లు వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా బెన్ ఫిట్ షోలు, అగ్రహీరోల కొత్త సినిమాలు  విడుదలైనప్పుడు చార్జీల పెంపునకు..రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంపై మొత్తం పరిశ్రమలో ఆందోళన ఉంది. జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా ప్రభుత్వం బెన్ ఫిట్ షోలు, టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు నిరాకరించింది. ఎగ్జిబిటర్లు కోర్టుకు వెళ్లినప్పటికీ, బెన్ ఫిట్ షోలు వేసేందుకు అనుమతి ఇచ్చినా, సినిమా టిక్కెట్లు పెంచుకునేందుకు పర్మిషన్  ఇవ్వలేదు. అప్పటి నుంచి సినిమా పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వివాదం ఏర్పడింది.
గతంలో కూడా ఓ సారి  మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, దర్శకుడు  రాజమౌళి, వంటి పలువురు ప్రముఖులు జగన్ తో భేటీ అయ్యారు.  సైరా నరసింహారెడ్డి విడుదల సందర్భంగా  చిరంజీవి సతీసమేతంగా జగన్‌ను కలిశారు. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్‌తో థియేటర్లు మళ్లీ మూత పడ్డాయి. ఇప్పటికీ ఏపీలో మూడు షోలు మాత్రమే వేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి కర్ఫ్యూ  అమలవుతున్నందున  నాలుగో షోకి అనుమతి లేదు.  తాజాగా ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లో విక్రయించేందుకు వెబ్ సైట్ ను ఏర్పాటు చేయాలని.. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా నియమించింది. ఈ నిర్ణయం పరిశ్రమ వర్గాలలో కలకలం రేకెత్తించింది. ఈ సమస్యలపై చర్చించేందుకు.. ఏపీ సీఎంను కలవాలని సినీ నటుల బృందం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తోంది. అపాయింట్మెంట్ దక్కకపోవడంతో సమాచారశాఖ మంత్రి పేర్ని నానితో  ఇండస్ట్రీ  పెద్దలు  సీఎంకు రాయబారం పంపారు. ఆ రాయబారం పంపిన  నెల రోజుల తర్వాత ఎట్టకేలకు అపాయింట్‌మెంట్ దొరికింది. ఈనెల 20వ తేదీన టాలీవుడ్  బృందం సీఎం జగన్‌తో భేటీ కానుంది. అయితే ఈ భేటీని అధికార వర్గాలు ఇంకా దృవీకరించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: