గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు అందుకేనా?

N.Hari
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని గుర్తిస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌పై ముందుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే నెల పదో తేదీ నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ను అమలు చేయనుంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్‌ల సమావేశంలో  కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలను స్పష్టం చేసినట్లు తెలిసింది. కేంద్ర జలసంఘంలోని  చీఫ్ ఇంజనీర్లను ఒక్కో బోర్డుకు ఇద్దరు చొప్పున నియమించింది. మూడు నెలల పాటు ఈ ఇంజినీర్లు బోర్టుకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించనున్నారు.
 రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలను పరిశీలిస్తూనే నదీ జలాల పరిధిలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను వచ్చే నెల నుంచి అమలులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలోని జలశక్తి శాఖ కార్యదర్శి ఏకే దాస్ లేఖ రాశారు. కేంద్ర జల సంఘంలోని చీఫ్ ఇంజినీర్ డాక్టర్ ఎం.కె. సిన్హా, మరో చీఫ్ ఇంజినీర్ అగర్వాల్‌ను గోదావరి నదీ యాజమాన్య బోర్డులో నియమించింది. మరో ఇరువురు చీఫ్ ఇంజినీర్లు సి.కె.శివరాజన్, అనుపమ్ ప్రసాద్‌లను కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో అనుసంధాన కర్తలుగా నియమించింది. ఈ నలుగురు అధికారులు బోర్డుల పరిధి, ప్రాజెక్టుల స్వాధీనం వంటి అంశాలను సాఫీగా జరిగేందుకు ప్రయత్నిస్తారని కేంద్రం జారీ చేసిన లేఖలో స్పష్టం చేశారు. బోర్డులో శాశ్వత ఉద్యోగులను నియమించడానికి ముందు ఈ అధికారులను తాత్కాలికంగా పంపుతున్నామని, మూడు నెలల పాటు ఈ చీఫ్ ఇంజినీర్లు  ఈప్రక్రియను పర్యవేక్షిస్తారని కేంద్రం స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్‌ను సాఫీగా అమలు జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ నలుగురు అధికారులు ప్రయత్నిస్తారు.
కేంద్రం నియమించిన నలుగురు అధికారులు రెండు బోర్డుల చైర్మన్లకు రిపోర్టు చేయాలని సూచించారు. ప్రాజెక్టులను టేకోవర్ చేయడం, సాఫీగా జరిగిపోయేందుకు ఈ అధికారులు పూర్తి సమయం కేటాయించాలని లేఖలో ఆదేశించారు. వీరిని లింక్ ఆఫీసర్స్‌గా కేంద్రం పేర్కొంది. బోర్డు చైర్మన్లతో జరిగిన సమావేశంలో ఈ అధికారుల నియామకానికి సంబంధించి ఛైర్మన్‌ల దృష్టికి తీసుకువెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: