ఫైర్‌బ్రాండ్ల సౌండ్ తగ్గిందే....ఎక్కడో తేడా కొడుతుందే..

M N Amaleswara rao
అధికార వైసీపీలో ఈ మధ్య ఫైర్ బ్రాండ్ నాయకుల హడావిడి కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్ష టి‌డి‌పి తమ ప్రభుత్వంపై గానీ, తమ నాయకుడు జగన్‌పై గానీ విమర్శలు చేస్తే వెంటనే బయటకొచ్చి మీడియా సమావేశం పెట్టి మరీ...దూకుడుగా టి‌డి‌పికి కౌంటర్లు ఇస్తారు. ఇక కొందరు ఫైర్ బ్రాండ్ నాయకులైతే ఒక అడుగు ముందుకేసి పరుష పదజాలంతో మరీ చంద్రబాబు, లోకేష్‌లపై ఫైర్ అవుతూ ఉంటారు.
రాష్ట్రంలో టి‌డి‌పి ఎలాంటి అంశంపై రాజకీయం చేసినా కూడా ఆ ఫైర్ బ్రాండ్ నాయకులు ఊరుకోరు. తక్షణమే టి‌డి‌పికి కౌంటర్లు ఇచ్చేస్తారు. అయితే ఇక్కడ ప్రతిపక్ష టి‌డి‌పి చేసే రాజకీయం ఏమి తగ్గలేదు గానీ, అధికార వైసీపీలోని ఫైర్ బ్రాండ్ల నాయకుల సౌండ్ మాత్రమే కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మంత్రుల్లో ఫైర్ బ్రాండ్లుగా ఉన్న కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు కాస్త దూకుడుగా విమర్శలు చేయడం తగ్గించారు. అలాగే మీడియాలో కూడా కనబడటం తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే పేర్ని నాని, కన్నబాబు, వెల్లంపల్లి లాంటి వారి హడావిడి కూడా పెద్దగా కనబడటం లేదని అంటున్నారు. అటు ఎమ్మెల్యేల్లో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకులు సైతం పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం తగ్గించారు. ఓ వైపు టి‌డి‌పి తనదైన శైలిలో రాజకీయం చేసుకుంటూ వెళుతూనే ఉంది. ఇక టి‌డి‌పికి ధీటుగా కౌంటర్లు ఇవ్వడంలో ఫైర్ బ్రాండ్లు ముందుకు రావడం లేదనే చెప్పొచ్చు. అంబటి రాంబాబు, రోజా లాంటి వారు కాస్త మీడియా ముందు సందడి చేయడం తగ్గించారు.
అలాగే ఇతర నాయకులు సైతం కాస్త కనిపించడం ఆగింది. ముఖ్యంగా టి‌డి‌పి ఎలాంటి విమర్శలు చేసిన వెంటనే స్పందించే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఈ మధ్య మీడియాలో కనిపించడం తగ్గించారు. మరి సడన్‌గా ఈ నాయకులు సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటో తెలియడం లేదు. మరి దీని వెనుక కూడా ఏమన్నా వ్యూహం ఉందేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: