గెజిట్ గొడవపై నేడు కీలక భేటీ...!

Podili Ravindranath
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీకి ముగింపు పలికేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే తెగని పంచాయతీలా మారిన జల వివాదాన్ని మరో నెల రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో  ముగించాలని కేంద్రం బలంగా భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహిస్తోంది మోదీ సర్కార్. వచ్చే నెల 14వ తేదీ నుంచి కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానున్న నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా వివాదానికి పరిష్కారం సాధించేందుకు తన వంతుల కృషి చేస్తోంది కేంద్ర సర్కార్.

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కలిసి తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై చర్చించేందుకు ఈ రోజు అత్యవసర సమావేశం నిర్వహించనుంది కేంద్రం. ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షత వహించనున్నారు. కృష్ణా బోర్డు ఛైర్మన్ mp సింగ్, గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. గెజిట్ నోటిఫికేషన్‌లో కృష్ణ, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు సంబంధించి ప్రాజెక్టుల పరిధి, వాటి కేటాయింపుపై తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలు, అభిప్రాయాలతో పాటు కీలక సూచనలు కూడా తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహించనుంది కేంద్ర జల్ శక్తి శాఖ. ఈ రోజు సమావేశ అజెండా కూడా ఇవే అంశాలు కావడం విశేషం.

ఈ ఏడాది జులై 15న కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ అమలుకు 3 నెలలు గడువు విధించిన కేంద్రం... అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పింది. ఈ లోపు ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కూడా తెలుగు రాష్ట్రాలను కోరింది. అయితే నోటిషికేషన్ అమలుకు 3 నెలలు గడువు సరిపోదని... ఎన్నో సమస్యలు ఉన్నాయని... అలాగే పలు కీలకమైన పనులు కూడా పూర్తి చేయాల్సి ఉందని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్రానికి తేల్చి చెప్పాయి. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన కృష్ణా, గోదావరి బోర్డు సమావేశాల్లో కూడా స్పష్టం చేశారు అధికారులు. అదే సమయంలో కృష్ణా, గోదావరి నదులపై ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులకు పూర్తి స్థాయి అనుమతులను అక్టోబర్ 14వ తేదీ లోపు ఇరు రాష్ట్రాలు పొందాలంటూ కేంద్రం విధించిన నిబంధనపై కూడా ఇరు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకోసం మరికొంత గడువు కావాలని కూడా ఇప్పటికే లేఖలు రాశాయి. కొన్ని ప్రాజెక్టులను షెడ్యూళ్ల నుంచి మార్చాలని ఏపీ, తెలంగాణ కోరాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: