పవన్ కల్యాణ్ రోడ్డున పడాలి!

Mekala Yellaiah
‛కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను రక్షించే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం దేశ పటిష్టతకు మూలాలు. ఇవే జనసేన సిద్ధాంతాలు.’ అంటూ పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ స్థాపించిన అనంతరం వచ్చిన విమర్శలకు సమాధానంగా చెప్పుకున్నారు. 2014 మార్చి 14న ఆయన జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించినా.. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బీజేపీ, టీడీపీకి మద్దతు ప్రకటించి, ఆ పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. అనంతరం పవన్ కు ఆయన పార్టీకి సిద్ధాంతాలు లేవని విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన జనసేన పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలు ఇవే అని ప్రకటించారు. అయినా ఇవి ఆచరణ సాధ్యం కాదని మళ్లీ విమర్శలు వచ్చాయి. పవన్ కల్యాణ్ పార్టీ సిద్ధాంతాలను ప్రకటించినట్టుగా ఆచరణలో చూపించడంలేదు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ప్రజాక్షేత్రంలోకి దిగిన ఆయన ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు మృగ్యమయ్యాయి. అసెంబ్లీలో అడుగు పెట్టే అడుగుపెట్టే అవకాశం కూడా దక్కలేదు. 2019లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన జనసేన పార్టీ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేదు. పవన్ ఎన్నికల ప్రచార సభలకు జనం పోటెత్తినా ఓట్లు పడలేదు. జనసేనకు అత్యధిక సభ్యత్వాలున్న గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ రెండుచోట్లా ఓడిపోయారు. దీంతో ఆయనకు ప్రత్యామ్నాయం అనిపించుకోవడం అంత సులభం కాదని అర్థమైంది. 

ఆయనకు సినీ ఇమేజ్, అభిమానులు ఉన్నా వైసీపీ, టీడీపీ బలంగా స్థిరపడిపోవడంతో ఓట్లు పడడంలేదు. కులమతాలకు వ్యతిరేకంగా జాతీయ భావనతో ఆవేశంగా మాట్లాడడాన్ని జనం నమ్మడంలేదు. సినిమా అనేది వ్యాపారం. రాజకీయాలు ప్రజలతో కూడిన వ్యాపకం. నిజమైన రాజకీయం అంటే బాధ్యతాయుతమైన వ్యవహారం. ఇప్పుడు పవన్ కల్యాణ్ నిపుణులు, విద్యాధికులను సలహాదారులుగా చేర్చుకోవాలి. రాజకీయాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి. తాను అనుకున్నట్టుగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే మాత్రం రోడ్డున పడాలి. ఎన్నికలు వచ్చేదాకా ప్రజల మధ్యనే ఉంటూ వారి పక్షాన పోరాడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: