కరీంనగర్‌ కాంగ్రెస్‌లో నేతల మౌనమేల?

N.Hari
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ ముగ్గురు కీలక నాయకుల మౌనరాగంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. నిజానికి తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త పీసీసీ అధ్యక్షుడు వచ్చినప్పటి నుంచి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సీనియ ర్ నేతలు గాంధీభవన్‌కు అంటిముట్టనట్లే ఉంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే జీవన్‌రెడ్డి ఈ మధ్య ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. దీనికితోడు పార్టీ కార్యక్రమాలకు జీవన్ రెడ్డి దూరంగానే ఉంటున్నారు.  పార్టీ విషయాలు కూడా  పట్టించు కోవడం లేదనే చర్చ గాంధీ భవన్ లో నడుస్తోంది.
మరో సీనియర్‌ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా పార్టీ వ్యవహారాలకు అంటీముట్టనట్లే ఉంటున్నారు. శాసనసభలో జరిగే బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ మీటింగ్‌కు తప్ప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అక్కడక్కడ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ట్లు చర్చ జరుగుతోంది. మరోనేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా ఈ మధ్య గాంధీ భవన్ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన మొదట్లో పార్టీ వ్యవహారాలలో పొన్నం చురుగ్గా పాల్గొన్నారు.  ఆ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇలా ఈ ముగ్గురు కరీంనగర్ జిల్లా నేతలు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై రిపోర్ట్ ఇచ్చే బాధ్యతను దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని నేతలకు పీసీసీ బాధ్యత అప్పగించింది. అయితే జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ముగ్గురూ కూడా.. అభ్యర్థి విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. అలా పీసీసీకి ఈ ముగ్గురూ ఝలక్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. మరోవైపు హుజూరాబా ద్ అభ్యర్థి ఎంపిక  విషయం లో కొండాసురేఖ పేరు తెరపైకి రావడం.. ఈ ముగ్గురు నేతలకు నచ్చలేదట. స్థానికులను కాదని కావాలనే కొండా సురేఖ పేరును రేవంత్ రెడ్డి  తెరపైకి తెచ్చారని  అసహనం వ్యక్తం చేసినట్టుగా చర్చ జరుగుతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్లు అందరూ అసంతృప్తి వ్యక్తం చేయడంతో చివరి నిమిషంలో కొండా సురేఖ అభ్యర్థిత్వానికి బ్రేకులు పడ్డాయి. కొండా సురేఖను పోటీకి దించాలంటే జిల్లాలోని సీనియర్ల అనుమతి అవసరంగా మారింది. మరి సీనియర్లను ఒప్పించి కొండా సురేఖకు టికెట్ ఇస్తారా? లేక జిల్లా నేతలు కోరినట్లు స్థానికులకు టికెట్ ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: