యూపీలో యాత్రల సమయం..!

Podili Ravindranath
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో అధికారం చేపట్టిన పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతుందనేది అన్ని పార్టీ నమ్మకం కూడా. ఇందుకోసం అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా ముందు నుంచే భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయి కూడా. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం యూపీలో ఇప్పటికే రాజకీయ సందడి మొదలైంది. యూపీపై స్పెషల్ ఫోకస్ చేసిన కాంగ్రెస్ పార్టీ... జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రేను ఇప్పటికే రంగంలోకి దింపింది. ఆమె వచ్చే నెల నుంచి రాష్ట్రంలో ఏకంగా 12 వేల కిలోమీటర్ల దూరం యాత్ర చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ బాటలోనే భారతీయ జనతా పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు కూడా నడుస్తున్నాయి. ప్రజల్లో ఆదరణ పొందేందుకు అన్ని అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ప్రజాదరణ కోసం బీజేపీ, ఎస్‌పీలు కూడా యాత్రలు చేసేందుకు రెడీ అయ్యాయి. యూపీలో మాదే విజయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేసిన గంటల వ్యవధిలోనే... సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో యూపీ పీఠంపై ఎస్‌పీ జెండా ఎగురుతుందన్నారు అఖిలేష్. జన్‌మాన్-విజయ్ పేరుతో యాత్ర చేపట్టి... తమ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని అఖిలేష్ స్పష్టం చేశారు. 2022 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ యువశక్తి కార్యకర్తలు... రాష్ట్రంలోని ప్రతి బూత్‌లో ఓటర్లలో చైతన్యం తీసుకొస్తుందన్నారు. ఐదేళ్లుగా యూపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... రాబోయే ఎన్నికల్లో మేలు చేసే పార్టీలకే ఓటు వేస్తారని అఖిలేష్ జోస్యం చెప్పారు.
ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఎంతో కాలంగా ఉన్న కులతత్వం, మతతత్వం, వారసత్వ రాజకీయాలకు మోదీ నేతృత్వంలోని బీజేపీ చరమ గీతం పాడిందన్నారు. ప్రస్తుతం దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన యూపీ నిలబడిందన్నారు. యూపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. అటు అన్ని సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని నడ్డా  ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: