రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్

N.Hari
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూ. 40 నుంచి రూ. 400 వరకు వేర్వేరు పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. 2022-23 మార్కెటింగ్ సీజన్‌కు గాను ఈ కొత్త కనీస మద్దతు ధరలు వర్తించనున్నాయని స్పష్టం చేసింది. దీంతో పాటు జౌళి రంగంలో ప్రోత్సాహకాలకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.
ఓ వైపు ఢిల్లీలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం పలు పంటలకు మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోధుమలకు గత రబీ మార్కెట్ సీజన్‌లో కనీస మద్దతు ధర రూ.1,975గా ఉంది. ఈ ఏడాది మార్కెటింగ్ సీజన్‌కు కనీస మద్దతు ధర రూ.2,015 గా ప్రకటించింది మోదీ సర్కారు. అంటే గోధుమలపై కనీస మద్దతు ధర రూ.40 మేరకు పెరిగినట్లు అయింది.
అలాగే బార్లీపై కనీస మద్దతు ధరను మరో రూ. 35 మేర కేంద్రం పెంచింది. క్వింటాల్‌ బార్లీ మద్దతు ధర రూ. 1,635 ఇవ్వాలని నిర్ణయించింది. శనగలపై కనీస మద్దతు ధర రూ. 130 పెంచింది. ఈ ఏడాదికి గాను ఆవాల మద్దతు ధరను కేంద్రం రూ. 400 పెంచి.. క్వింటాల్‌ ధర రూ. 5,050 గా నిర్ణయించింది. ఇక చెరుకు రైతులకు కూడా కేంద్రం తీపి కబురు చెప్పింది. క్వింటాల్‌ చెరుకుకు మద్దతు ధరను రూ. 290 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు జౌళి రంగంలో ప్రోత్సాహకాలకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జౌళి రంగంలో ఐదేళ్లలో రూ. 10,683 కోట్లు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ప్రత్యక్షంగా 7.50 లక్షల మందికీ, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించడంలో సహాయ పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంమీద కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో.. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతులకు ఊరట నిచ్చేలా మోదీ సర్కారు నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: