అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌కు క‌త్తి మీద సాములా మారిందా.?

Paloji Vinay
    తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌గా మారింది. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం అన్ని పార్టీల‌కు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. ఇటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎలాగైన విజ‌యం సాధించి త‌మ ప్ర‌భుత్వం పాల‌న‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఉంద‌ని చూపాల‌ని చూస్తోంది. అటు ఆత్మ‌గౌర‌వం పేరుతో గులాబీ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్ కాషాయ కండువా క‌ప్పుకున్నారు. దాదాపు 18 ఏండ్లుగా తిరుగులేని విజ‌యాన్ని ఈట‌ల పొందుతూ వ‌చ్చారు. త‌న ఆత్మ‌గౌర‌వంతో పాటు త‌న విజ‌యాన్ని నిలుపుకుని బ‌లాన్ని చూపాల‌ని ఈట‌ల రాజేంద‌ర్ త‌హ‌త‌హ‌లాడుతున్నారు.
 ఈట‌ల విజ‌యంతో బీజేపీకి తెలంగాణ‌లో మంచి ప‌ట్టు వ‌స్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు చూస్తున్నారు.


ఇప్ప‌టికే టీఆర్ఎస్‌, బీజేపీ త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. అయితే, కాంగ్రెస్ ఇప్ప‌టికీ ఇంకా అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.  రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా ఎన్నిక‌యిన త‌రువాత వ‌చ్చిన మొద‌టి ఎన్నిక కావ‌డంతో ఈ ఎన్నిక‌ను రేవంత్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఎలాగైన గెలిచి కాంగ్రెస్‌కు పున‌ర్ వైభ‌వం తీసుకు రావాల‌ని రేవంత్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.


అభ్య‌ర్థి ఎంపిక విషయంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే అభ్య‌ర్థి ఎన్నిక విష‌యం కాంగ్రెస్‌కు క‌త్తిమీద సాములా మారింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల పార్టీ టిక్కెట్ కావాల‌నుకునే వారు రూ.5 వేలు క‌ట్టి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని పార్టీ ఎన్నిక‌ల క‌మిటీ నిర్ణ‌యించింది. అయితే, గ‌తంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలో నిల‌పాల‌ని రేవంత్ రెడ్డి అనుకున్నారు. అప్పుడు, మాజీ మంత్రి కొండా సురేఖ‌ను ప్ర‌తిపాధించారు. కానీ గ‌తంలో అనుకున్న అభ్య‌ర్థుల ప్ర‌చారంలో ఉన్న వారిలో కేవ‌లం కిసాన్ సెల్ అధ్య‌క్షుడు ప‌త్తి కృష్ణారెడ్డి మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

  అయితే, రాష్ట్ర నాయ‌క‌త్వం ఆలోచ‌న ఒక‌టి ఉంటే స్థానిక నేత‌ల‌ది మ‌రొక విధంగా ఉంది. కొండాసురేఖ నాన్‌లోక‌ల్ కావ‌డంతో లోక‌ల్‌గా ఉన్న జిల్లా నేత‌లు అస‌హ‌నంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. నాన్ లోక‌ల్ అభ్య‌ర్థికి టికెట్ ఇస్తే ప్ర‌జ‌ల‌కు వేరేవిధంగా సంకేతాలు వెళ్తాయ‌ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లార‌ట‌. దీంతో రాష్ట్ర నాయ‌కులు సందిగ్ధంలో ప‌డ్డ‌ట్టు స‌మాచారం.  అయితే, కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎవ‌రో తేలాలంటే మ‌రో ప‌ది రోజులు వేచిచూడాల్సిందే. లేదా ఎన్నిక వాయిదా ప‌డ‌డంతో ఇప్పుడు అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తారా లేదా ఇంకా స‌మ‌యం తీసుకుంటారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: