చంద్ర‌బాబు చేసిన మోసంతోనే రోజా టీడీపీకి గుడ్ బై చెప్పేసిందా ?

VUYYURU SUBHASH
తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా వారిలో చాలా తక్కువ మందికే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. 1990వ దశకంలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా.. వారిలో కొంద‌రే వెండితెరను ఏలారు. అయితే వారిలో విజయశాంతి - రోజా లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చారు. వీరిలో విజయశాంతి మెదక్ నుంచి టిఆర్ఎస్ తరఫున ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ నుంచి మెద‌క్‌ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఇక రోజా విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ పార్టీ తరఫున నాటి సమైక్యాంధ్రలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఓ వెలుగు వెలిగారు. రోజా తన మాటల తూటాలతో ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నేతలకు చెమటలు పట్టించే వారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు ఆమె ఎలాగైనా అసెంబ్లీలో ఉండాలని పట్టుబట్టారు. 2004 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి ఆమెను పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో రోజా కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత చెందిన రెడ్డి వారి చెంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే 2009 ఎన్నికల్లో అప్పటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు టీడీపీ లోకి రావడంతో చంద్రబాబు ఆయనకు నగరి సీటు ఇచ్చేందుకు రోజాకు ఇష్టం లేకపోయినా చంద్రగిరి నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో రోజా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు.
తనకు ఇష్టం లేకపోయినా చంద్రబాబు తనను బలవంతంగా చంద్రగిరి లో పోటీ చేయించార‌ని రోజా వాపోయారు. తాను ఓడిపోవడం తో పాటు ఆర్థికంగా నష్టపోవడానికి బాబే కారణమయ్యారని రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు నచ్చిన చోట సీటు ఇవ్వలేదని టిడిపి నేతలే త‌న‌ను కావాలని ఓడించారని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే చంద్రబాబు రోజా ఫిర్యాదులు పట్టించుకోకపోవడంతో... ఆమె వెంటనే వెళ్లి నాటి కాంగ్రెస్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాజశేఖర్ రెడ్డి మృతి చెందగా... రోజా ఆయన తనయుడు జగన్ వెంటే ఉన్నారు. ఆ తర్వాత వరుసగా రెండు సార్లు అదే నగరి నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: