ఆ విష‌యంలో కొడాలి నానిని మించిన మొన‌గాడే లేడా ?

VUYYURU SUBHASH
కొడాలి నాని అంటే జగన్ కి చాలా ఇష్టం అంటారు. దానికి కారణం ఏంటి అంటే ఆయన బాగా టీడీపీని విమర్శిస్తారు. దానికి మించి చంద్రబాబు అంటే చాలు పూనకం వచ్చినట్లుగానే కొడాలి మీడియా ముందు తిట్ల దండకాన్ని అందుకుంటారు. రెండేళ్ళ ఆయన మంత్రి గిరీలో శాఖాపరంగా ఏ రకమైన ప్రగతి సాధించారు, ఆయన పనితీరు ఏంటి అన్నది పక్కన పెడితే చంద్రబాబు అండ్ కో ను చీల్చి చెండాడడంలో మాత్రం  తనకు సరిసాటి ఎవరూ లేరని మాత్రం పేరు తెచ్చుకున్నారు. కొద్ది నెలలలో మంత్రి వర్గ విస్తరణ జరగబోతోంది. మిగిలిన మంత్రులు అంతా తమ పదవులు ఉంటాయా ఊడతాయా అని గట్టిగానే మధనపడుతున్నారు. కానీ కొడాలి నానికి మాత్రం ఆ బెంగ లేదు అంటున్నారు. ఎందుకంటే ఆయన కంటే బాబుని తిట్టే బహు మొనగాడు ఎవరూ లేరు. దాంతో ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదని విశ్లేషిస్తున్నారు.
ఇదిలా ఉంటే చంద్రబాబుకు గత రెండున్నరేళ్ళూ రాజకీయంగా అసలు కలసిరావడంలేదు. ఇక ఆయన వయసు కూడా మీరిపోయింది. పూర్వం మాదిరిగా రాజకీయం చేయడానికి ఆయనలో ఓపిక లేదు. ఈ పాటికే కొడుకు అందుకు వచ్చి ఉంటే బాబుకు ఈ తిప్పలు ఉండేవి కావు. దాంతో ఎలాగైనా మళ్ళీ టీడీపీకి అధికారం రాబట్టాలంటే బాబు పోరాడాల్సిందే. దాంతో చంద్రబాబు అటు పార్టీని సమాయత్తపరుస్తూనే తన బాధలేవో తాను పడుతున్నారు. అయితే చంద్రబాబు ఏం చేసినా వెంటనే గాలి తీసేసేలా కొడాలి కామెంట్స్ చేస్తున్నారు.
ఆయన మాటలు తమ్ముళ్ళు వింటారా అంటే అది కాదు కానీ వరసపెట్టి అదే పనిగా చేస్తూ వస్తున్న విమర్శలలలో కొన్ని అయినా తెలుగు తమ్ముళ్ళ చెవులలోకి పోవడం ఖాయమే అంటున్నారు. పైగా టీడీపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా కొడాలి కామెంట్స్ ఉంటున్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని పదే పదే కొడాలి చేస్తున్న కామెంట్స్ వెనక కూడా పక్కా వ్యూహం ఉంది అంటున్నారు. లోకేష్ కి నాయకత్వ పటిమ లేదని, బాబుకు వయసు అయిపోయిందని, ఇక పార్టీ ఎక్కడిది అంటూ కొండాలి పేల్చుతున్న మాటల తూటాలు తమ్ముళ్ళ బుర్రలలోకి బాగానే ఎక్కేస్తున్నాయి. ఇక తాజాగా ఆయన మరో బాంబు    పేల్చారు.
అదేంటి అంటే టీడీపీ బీజేపీలో విలీనం అవుతుందని, ఏపీలో బీజేపీ సీన్ చూసిన వారు ఎవరూ ఈ మాటలు నమ్మరు కానీ టీడీపీ దైన్యాన్ని మాత్రం కొడాలి నాని ఎత్తిపొడవడానికి ఇది బాగానే ఉపయోగ‌పడుతోంది అంటున్నారు. చంద్రబాబు జూమ్ మీటింగులు పెట్టి మనదే మళ్ళీ అధికారం అని గట్టిగానే గర్జిస్తున్నారు. అదే టైమ్ లో టీడీపీ ఇక ఇంటికే ఆ పార్టీకి అధికారం కల్ల అంటూ కొడాలి నాని తనదైన స్టైల్ లో విరుచుకుపడుతున్నారు. దీంతో తమ్ముళ్ళు పూర్తి డైలమాలో పడిపోతున్నారు.
మొత్తానికి టీడీపీని ఒక ఆట ఆడుకోవడమే కాదు, చంద్రబాబుకు కూడా సరైన ప్రత్యర్ధిగా నాని నిలుస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ కామెంట్స్ వల్ల టీడీపీకి నష్టమే అన్న విశ్లేషణలు ఉన్నాయి. చిత్రమేంటి అంటే కొడాలి నాని కామెంట్స్ ని ఖండించే వారు ఎవరూ టీడీపీలో లేకపోవడంతో తమ్ముళ్ళు అవి నిజమనే నమ్మితే మాత్రం కొంప కొల్లేరే అంటున్నారు అంతా..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: