కొడాలి-వంశీ-అవినాష్‌లకు ఎదురులేనట్లేనా?

M N Amaleswara rao
సాధారణంగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో కమ్మ వర్గం హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీలో కమ్మ వర్గం నాయకుల ఆధిక్యం ఉంటుంది. జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు వారి చేతిల్లోనే ఉంటాయి. గెలుపోటములని ప్రభావితం చేయగల సత్తా వారికి ఉంటుంది. అయితే టీడీపీలో కమ్మ నాయకులకు చెక్ పెట్టేందుకు వైసీపీలో కమ్మ నేతలకు ప్రాధాన్యత పెరిగింది.
అలాగే అధికారంలోకి వచ్చాక జిల్లాలో వైసీపీలో ఉన్న కమ్మ నాయకులకు తిరుగులేకుండా పోయింది. మూడు నియోజకవర్గాల్లో వైసీపీ తరుపున్న పని చేస్తున్న కమ్మ నాయకులు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మొదట నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడని కొడాలి నాని వైసీపీ కంచుకోటగా మార్చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ పార్టీలకు అతీతంగా నానికి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో పనిచేస్తున్న నానికి, గుడివాడలో ఎదురులేదని చెప్పొచ్చు.
ఇక్కడ నానికి చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యం కావడం లేదు. భవిష్యత్‌లో సైతం నానికి తిరుగులేదని చెప్పొచ్చు. అటు గన్నవరంలో వల్లభనేని వంశీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన వంశీ, తర్వాత వైసీపీ వైపుకు వచ్చేశారు. వంశీ వైసీపీ వైపుకు రావడంతో గన్నవరంలో టీడీపీ చాలా వీక్ అయిపోయింది. దీంతో వంశీకి ఎదురులేకుండా పోయింది. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయన వైసీపీ తరుపున బరిలో దిగడం ఖాయం. అలాగే గెలుపు కూడా సులువుగానే వస్తుందని తెలుస్తోంది.
ఇక విజయవాడ తూర్పు ఇన్‌చార్జ్‌గా ఉన్న దేవినేని అవినాష్ సైతం చాలా స్ట్రాంగ్ అయ్యారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన అవినాష్‌కు తూర్పు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రజలకు అండగా నిలబడటంలో అవినాష్ ముందున్నారు. సొంత డబ్బులు సైతం ఖర్చు పెడుతూ, ప్రజలకు సాయం చేస్తున్నారు. దీంతో తూర్పులో అవినాష్ బలపడ్డారు. నెక్స్ట్ ఎన్నికల్లో అవినాష్ గెలుపు కూడా నల్లేరు మీద నడకే అని చెప్పొచ్చు.  మొత్తానికైతే కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొడాలి-వంశీ-అవినాష్‌లకు తిరుగులేదనే తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: