సచివాలయాల కష్టాలు ఇకనైనా వెలుగులోకి వస్తాయా..?

Deekshitha Reddy
ఏపీలో సచివాలయ వ్యవస్థ పనితీరు వైసీపీ ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చిపెట్టింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలు పేదల ఇంటి వద్దే అందుబాటులోకి వస్తుండటంతో ఇతర రాష్ట్రాలు కూడా దీనిపై ఫోకస్ పెట్టాయి. అదే సమయంలో సచివాలయాల్లో కూడా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నా వీలు కావడంలేదు. అయితే ఇప్పుడు సచివాలయాల సందర్శన పేరుతో సీఎం జగన్ ఓ షెడ్యూల్ ప్రకటించారు. దీంతో అయినా గ్రామ, వార్డు సచివాలయాల సమస్యలు పరిష్కారమవుతాయో లేదో చూడాలి.
వారానికోసారి గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండింటిని కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశాలిచ్చారు జగన్. వారానికి 4 సచివాలయాలను జాయింట్ కలెక్టర్లు సందర్శించాలని సూచించారు. మున్సిపాల్టీల కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు వారానికి 4 సచివాలయాలు సందర్శించేలా ఆదేశాలిచ్చేట్టు ఉన్నతాధికారులకు సూచించారు. అంతేకాదు ఇలా సందర్శించిన తర్వాత వారు ఇచ్చే నివేదికలే వారి పనితీరుకి సూచికలుగా భావిస్తామని కూడా చెప్పారు సీఎం జగన్. దీన్నీ సీఎంఓ కార్యాలయం స్వయంగా పర్యవేక్షిస్తుందని చెప్పారు.
 
గ్రామస్తుల సమస్యలు పరిష్కరించే సచివాలయాల్లో కూడా అనేక సమస్యలున్నాయి. గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో చాలా చోట్ల మొబైల్ డేటా ఆధారంగా సచివాలయాల్లో కంప్యూటర్లు ఆపరేట్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల సరైన వసతి సౌకర్యాలుండటంలేదు. ఇక సచివాలయాలకు బాధ్యులుగా ఎవరుండాలనే విషయంపై కూడా రెండేళ్లవుతున్నా క్లారిటీ లేదు. మొదట్లో పంచాయతీ సెక్రటరీలను సచివాలయాలకు అధిపతిగా నియమించినా, తర్వాత వీఆర్వోలను డ్రాయింగ్ ఆఫీసర్లుగా నియమిస్తూ జీవో జారీ చేశారు. ఇప్పటికీ అది అమలులోకి రాలేదు. ఇక బయోమెట్రిక్ హాజరుతో ఉద్యోగుల పనితీరు మెరుగవుతుందని అనుకున్నా కూడా.. సాంకేతిక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ ఉన్నతాధికారుల సందర్శతో పరిష్కారం లభించొచ్చని అంటున్నారు ఉద్యోగులు. మరోవైపు రెండేళ్లలో సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసి వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెబుతున్నా.. దానికి కూడా సరైన విధి విధానాలు ఖరారు కాలేదు. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలంటున్నారు ఉద్యోగులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: