వైఎస్ నడిచిన రూట్లోనే బండి సంజయ్ !

Chaganti
బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారని ముందునుంచీ పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు బండి సంజయ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు. విలేఖరుల సమావేశంలో బండి సంజయ్ తన పాదయాత్ర విషయాన్ని ప్రకటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టినట్టుగానే ఈయన కూడా రంగారెడ్డి నుంచే మొదలు పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు రానున్న రెండున్నరేళ్లు పాదయాత్ర ఉండేలా ప్రణాళికలు తయారు చేసుకున్నారు. 

నాలుగు విడతల్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపడతామని, మొదటి విడత క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు అంటే ఆగస్టు 9న హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. పాతబస్తీ, ఆర్య మైసమ్మ, మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ మీదుగా మొదలు కానున్న ఈ పాదయాత్ర అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా హుజురాబాద్ లో ముగియనుంది. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పాదయాత్ర ఉంటుంది. మొదటి విడతలో భాగంగా రోజుకు 15 నుండి 20 కిలోమీటర్లు బండి సంజయ్ నడవనున్నారని తెలుస్తోంది. నిరవధికంగా  55 రోజుల పాటు 750 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా చుట్టి రానున్నారు.  
 
ఇక ఈ ప్రెస్ మీట్ లో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకుంటున్న జల వివాదంపై బండి సంజయ్ మండిపడ్డారు. ఒక ప్రణాళిక ప్రకారం ఇరువురు ముఖ్యమంత్రులూ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారని, హుజురాబాద్ లో రాజకీయ లబ్ధి కోసమే జగన్ తో కేసీఆర్ రాజీపడ్డారని విమర్శించారు. కృష్ణా నది జలాలు 50-50 అని కేసీఆర్ రాసిన లేఖ ఒక బూటకమని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ తీరుతో తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా... అది 299 టీఎంసీలకు పరిమితం అయ్యిందని తెలంగాణ సీఎం తీరును తప్పుబట్టారు. ఇక ఒకటి రెండు ఎన్నికల్లో ఓడినంత మాత్రానా వెనకడుగు వేసినట్లు కాదని, హుజురాబాద్ లో ఈటల మాత్రమే గెలుస్తాడని, కేసీఆర్ ఎన్ని కోట్లు పెట్టినా గెలవలేడని, దుబ్బాకలో జరిగినట్టుగానే బీజేపీ ఉత్సాహంగా పని చేస్తోందని అన్నారాయన. కేంద్ర పథకాలను తెలంగాణ ప్రభుత్వం హైజాక్ చేస్తోందని బండి ఆరోపించారు.
 
కేసీఆర్ హయాంలో దళితులకు రక్షణ కరువయ్యిందని, హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత ఎంపవర్మెంట్ సమావేశమని దుయ్యబట్టారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం అంటూ కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఎక్కడ? అని ప్రశ్నించారు. అంతేకాదు కేంద్రం ఇచ్చిన 2 వేల ఐదు వందల కోట్లు ఎక్కడికి వెళ్ళాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత వ్యాకిన్, రేషన్ బియ్యం కేంద్రం ఇస్తున్నప్పటికీ, వాటిపై ప్రధాని మోదీ ఫోటో‌ను పెట్టటం లేదు అన్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సిబ్బంది లేక ప్రజలు ఇబ్బందులు పడ్తున్నారని చెప్పుకొచ్చారు బండి సంజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: