బీజేపీని టార్గెట్ చేసిన నాని...టీడీపీకి ఆ సత్తా ఉందా?

M N Amaleswara rao

గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినా సరే ఏపీలో మాత్రం బీజేపీ బాగా హడావిడి చేస్తూనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఏపీలో పుంజుకోవాలని బీజేపీ బాగా ప్రయత్నిస్తుంది. మొదట్లో కొంతమంది  టీడీపీ నేతలని పార్టీలో చేర్చుకుని, అసలు టీడీపీ పని అయిపోయింది..తామే జగన్‌కు ప్రత్యామ్నాయమని అన్నారు. జనసేనతో పొత్తు పెట్టుకుని నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ చెప్పేసింది.


కానీ ఎన్నికలై రెండేళ్ళు దాటేసింది. ఈ రెండేళ్ల కాలంలో బీజేపీ ఓటు బ్యాంక్ ఏ మాత్రం పెరగలేదు. కనీసం నోటాని దాటలేదు. పైగా జనసేన ఓటు బ్యాంక్‌కు కూడా డ్యామేజ్ జరిగింది. అసలు టీడీపీ స్థానంలోకి బీజేపీ ఏ మాత్రం రాలేకపోయింది. అదే విషయాన్ని తాజాగా మంత్రి కొడాలి నాని పరోక్షంగా చెప్పారని విశ్లేషకులు అంటున్నారు. జాబ్ క్యాలెండర్ విషయంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీకి నాని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, ఏపీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చర్చిద్దామని అన్నారు.


టీడీపీని తోక్కేసి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుందని, చంద్రబాబు ఏదైనా దీక్ష చేస్తే, బీజేపీ కూడా ఏదొకటి చేస్తుందని, కానీ ఏపీలో బీజేపీని ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. అంటే నాని ఇక్కడ డైరక్ట్‌గా బీజేపీపైన విమర్శలు చేసిన పరోక్షంగా టీడీపీని తోక్కేసే స్థాయికి బీజేపీకి లేదనే చెప్పినట్లు ఉందని అంటున్నారు. అలాగే చంద్రబాబు చేస్తున్నట్లు బీజేపీ చేస్తున్న కూడా.. ఆ పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదని పరోక్షంగా చెప్పేశారు.


అంటే టీడీపీని ప్రజలు పట్టించుకుంటున్నారని అర్ధం వచ్చేలా ఉందని అంటున్నారు. ఇంకా ఏపీ టీడీపీకి బలం ఉందనే విధంగా నాని వ్యాఖ్యలు ఉన్నాయని, అసలు టీడీపీని రీప్లేస్ చేయడం బీజేపీ వల్ల కాదని చెబుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా వైసీపీని ఎదురుకునే సత్తా టీడీపీకే ఉందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: