కొడాలి ప్రత్యర్ధిని మార్చాల్సిందేనా!

M N Amaleswara rao

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం....మంత్రి కొడాలి నానికి కంచుకోట. అయితే ఇప్పుడు కొడాలి నానికి కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గం 2009 వరకు టీడీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీ తిరుగులేని విజయాలు సాధించింది. ఎన్టీఆర్ సైతం ఇక్కడ ఒకసారి పోటీ చేసి విజయం సాధించారు. ఇక కొడాలి నాని సైతం టీడీపీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున విజయం సాధించారు.


కానీ రెండుసార్లు టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఈ క్రమంలోనే 2009 ఎన్నికల తర్వాత వైఎస్సార్ మరణించడం, జగన్ వైసీపీ పెట్టడంతో నాని అటు వెళ్ళిపోయారు. పైగా కృష్ణా జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు ఇబ్బందిగా మారడంతో నాని పార్టీ మారిపోయారు. వైసీపీలోకి వెళ్ళి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచేశారు. ఇప్పుడు మంత్రిగా దూకుడుగా ఉన్నారు. నాని వైసీపీలోకి వెళ్లడంతో గుడివాడలో టీడీపీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు.


2014లో నాని మీద రావి వెంకటేశ్వరరావు టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయి, ఆ తర్వాత ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళి, ఇప్పుడు విజయవాడ తూర్పు ఇన్‌చార్జ్‌గా సెటిల్ అయ్యారు. అవినాష్ వైసీపీలోకి వెళ్లడంతో చంద్రబాబు మళ్ళీ రావిని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. ఇక పేరుకే రావి ఇన్‌చార్జ్ గానీ, పని మాత్రం చేయడం లేదు. అసలు పార్టీలో కనిపించడం లేదు. నాని దెబ్బకు రావి సైలెంట్ అయిపోయారు. దీంతో గుడివాడలో టీడీపీ జెండా కనిపించడం తగ్గిపోయింది.


ఈ క్రమంలోనే నాని ప్రత్యర్ధిగా రావి పనికిరారని, ఆయన స్థానంలో బలమైన నాయకుడుని పెట్టాలని కొంతమంది టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ గుడివాడలో టీడీపీకి గట్టి నాయకులు ఉన్నారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ, యలవర్తి శ్రీనివాసరావులు గుడివాడ రాజకీయాల్లో ఉన్నారు. ఇక రావి బదులు వీరిలో ఒకరికి టిక్కెట్ ఇస్తే బెటర్ అని చెబుతున్నారు. మరి చూడాలి గుడివాడలో కొడాలి ప్రత్యర్ధిని మారుస్తారో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: