లాక్ డౌన్ వల్ల ఆ రాష్ట్రానికి అంత లాభమా ?

VAMSI

ఇండియా అంతా గతంలో లాగే ఈ సంవత్సరం కూడా కరోనా వైరస్ ధాటికి విలవిలలాడిపోతోంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి కరోనా తన ప్రభావాన్ని రెండింతలు ఎక్కువగానే  చూపెడుతోంది. కరోనా ఎక్కువగా యువకులే లక్ష్యంగా తన పంజాను  విసిరిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ తీవ్రతకు తాళలేక ఎంతో మంది యువకులు మరియు 40 సంవత్సరాల వయస్సు లోపు వారు ఎక్కువగా మరణించారు. కరోనా వలన కేసులు పెరుగుతున్న సందర్భంలో వివిధ రాష్ట్రాలు మే నెలలో లాక్ డౌన్ విధించాయి. దీని కారణంగా పరిశ్రమలు మరియు ప్రభుత్వ ప్రైవేట్ కార్యకలాపాలు అన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. అన్ని రంగాలలోను ఆర్థిక ఇబ్బందులు తలెత్తగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో, తద్వారా రాష్ట్రాలకు వివిధ రకాలుగా రావాల్సిన ఆదాయం తగ్గిందనే  చెప్పాలి. అయితే మిగిలిన రాష్ట్రాల సంగతి ఏమోగానీ తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం లాక్ డౌన్ కాలం బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. లెక్కలు చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది.

ఇంతకీ కరోనా పుణ్యమా అని తెలంగాణ సర్కార్  ఖజానాలో ఎంత మొత్తం చేరింది అంటే, భారీ గానే లాభం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయానా డీజీపీ మహేందర్ రెడ్డి ఒకానొక సందర్భంలో వెల్లడించిన విషయం తెలిసిందే.  కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే పలురకాల చర్యలు తీసుకునే అవకాశం పోలీసు వారికి ఉంటుంది. ఇందులో భాగంగానే  సోషల్ డిస్టెన్స్ పాటించని  41,872 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరియు మాస్కులు ధరించని వారు 4.18 లక్షల మందిపై కేసులు నమోదు చేయగా, తద్వారా రూ.35.81 కోట్ల రూపాయలు జరిమానా రూపంలో వచ్చినట్లు సమాచారం.  కర్ఫ్యూ విధించిన సమయాల్లో అనవసరంగా రోడ్లపైకి వచ్చినందుకు గాను కర్ఫ్యూ ఉల్లంఘన క్రింద 2.61 లక్షల మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అకారణంగా భారీ సంఖ్యలో జనాలు గుమిగూడినందుకుగాను 13,867 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ నివేదికలో పేర్కొన్నారు.

రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు అయిన లిక్కర్ పరంగా కూడా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం అందినట్లు తెలిపారు. ఓ వైపు లాక్ డౌన్ కొనసాగుతున్నా మందు బాబులు మాత్రం మద్యం కొనేందుకు బార్ ల వద్ద  బారులు తీరి ప్రభుత్వానికి ఆదాయం అందేలా శ్రమించారని చెప్పాలి. మే నెలలో  మొత్తంగా రూ. 2,116 కోట్ల విలువైన మద్యం వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయగా, హైదరాబాద్‌లో  191 కోట్ల రూపాయలు, రంగారెడ్డి జిల్లాలో రూ. 448 కోట్ల రూపాయలు, వరంగల్‌ లో దాదాపుగా180 కోట్ల రూపాయలు,  నల్గొండలో 241 కోట్ల విలువైన మద్యం అమ్మకం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలన్నీ చూస్తే లిక్కర్ పై ప్రభుత్వానికి ఆదాయం బాగానే ముట్టినట్లు తెలుస్తోంది. ఇలా తెలంగాణ రాష్ట్రం ఓవైపు కరోనా కష్టాలు ఎదుర్కొంటూనే మరోవైపు ఆర్థికంగా బలపడుతుందని వివరాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: