ఆ రెండు కంచుకోటల్లో సైకిల్ సవారీ ఆగిపోయినట్లేనా?

M N Amaleswara rao

కృష్ణా జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉండే జిల్లా. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. అలాగే జిల్లాలో పలు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. ఆ కంచుకోటల్లో టీడీపీ ఎక్కువసార్లు గెలిచింది. ఏదో రెండు, మూడు సార్లు మాత్రమే ఓడిపోయిన నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌తో కృష్ణా జిల్లాలో సైతం సైకిల్‌కు బ్రేకులు పడిపోయాయి.


అలాగే కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఇప్పటికీ ఆ నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకోలేదు. అయితే భవిష్యత్‌లో కూడా కొన్నిచోట్ల సైకిల్ సవారీ ఉండదని అర్ధమవుతుంది. అలా సైకిల్ చాప్టర్ క్లోజ్ అయిపోయిన నియోజకవర్గాల్లో గుడివాడ, గన్నవరం నియోజవర్గాలు ఉంటాయి. మొదట నుంచి ఈ రెండు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. కానీ గుడివాడలో కొడాలి నాని ఎప్పుడైతే టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారో అప్పటినుంచి గుడివాడలో పసుపు జెండా ఎగరడం లేదు.


గుడివాడలో నాని టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2014 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్లారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో నాని వరుసగా వైసీపీ నుంచి గెలిచారు. పైగా ఇప్పుడు మంత్రిగా దూకుడుగా ఉన్నారు. ఇక నాని దెబ్బకు గుడివాడలో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది. పేరుకు టీడీపీ ఇన్‌చార్జ్‌గా రావి వెంకటేశ్వరరావు ఉన్నారుగానీ, పెద్ద ప్రయోజనం లేదు. భవిష్యత్‌లో టీడీపీ, నానికి పోటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇప్పటిలో గుడివాడలో పసుపు జెండా ఎగిరేలా కనిపించడం లేదు.


అటు గన్నవరంలో కూడా అదే పరిస్తితి. గత రెండు పర్యాయాలు గన్నవరంలో వల్లభనేని వంశీ గెలుస్తున్నారు. రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన వంశీ, వైసీపీ వైపుకు వచ్చేశారు. దీంతో గన్నవరంలో టీడీపీ వీక్ అయిపోయింది. గతంలో గన్నవరం నుంచి టీడీపీ తరుపున గెలిచిన దాసరి బాలవర్ధనరావు సైతం వైసీపీలోకి వచ్చారు. దీంతో గన్నవరంలో టీడీపీకి బలమైన నాయకత్వం లేదు. ఇన్‌చార్జ్‌గా బచ్చుల అర్జునుడు ఉన్నారుగానీ, ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వంశీకు టీడీపీ పోటీ ఇవ్వలేదని అర్ధమవుతుంది. మొత్తానికైతే రెండు కంచుకోటల్లో సైకిల్ సవారీ ఆగిపోయినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: