లక్కీ జాలరి.. వలలో రూ.72 లక్షల చేప..?

Chakravarthi Kalyan
సముద్రమే జీవనంగా మత్స్యకారుల జీవితాలు సాగిపోతుంటాయి. వేటాడే బోట్లు, చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య సంపద, వేలంపాటలు, ఎగుమతులు.. టోకు వ్యాపారాలతో లావాదేవీలు.. ఇవే వారి జీవితం. వీరంతా నిత్యం తీరం వెంటే ఉండడానికే ఇష్టపడతారు. నదుల్లో, కాల్వల్లో, సముద్రంలో మత్స్య సంపద వేటాడి జీవిస్తుంటారు. నిత్యం సముద్ర కెరటాలతో ప్రాణాలొడ్డి వేట సాగించినా వీరి జీవితాల్లో సంతోషాలు అంతంతమాత్రమే.
రోజంతా వేటాడినా వీరికి దక్కేది అరకొర సంపాదనే. మత్స్యకారులు ప్రాణాలను పణంగా పెట్టి వేటాడిన సంపదతో యజమానులు కోట్లకు పడగలెత్తుతుంటే వీరు మాత్రం కూలి డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి ఓ మత్స్యకారుడి జీవితం ఒక్క చేపతో సమూలంగా మారిపోయింది. అతని వలలో పడిన ఒకే ఒక్క చేప అతని జీవితాన్ని సమూలంగా మార్చేసింది. అదృష్టం అంటే అతడిదే అంటూ తోటి మత్స్యకారులు ఆశ్చర్యపోయేలా అసూయ పడేలా అతని జీవితం మార్చేసింది ఒకే ఒక్క చేప.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని గ్వాదర్‌ తీరానికి చెందిన మత్స్యకారుడు సాజిద్‌ హాజీ అబాబాకర్‌ వలలో పడిన ఒక చేప అతడిని దాదాపు కోటీశ్వరుడిని చేసింది. ఒకే ఒక చేపతో అతడు ఏకంగా రూ.72 లక్షలు సంపాదించాడు. ఎందుకంటే.. అబాబాకర్‌ పట్టింది మామూలు చేప కాదు. అది అత్యంత అరుదైన అట్లాంటిక్‌ క్రోకర్‌ జాతి చేప. అదీ కాక ఆ చేప ఏకంగా 48 కేజీల బరువు ఉంది. ఈ చేప వేలంలో రూ.72 లక్షల ధర పలికింది. మరి ఈ చేపకు ఎందుకు అంత డిమాండ్ అంటారా.. ఈ చేపకు వైద్యపరంగా ప్రత్యేకత ఉంది.
యూరప్‌, చైనాల్లో ఈ క్రోకర్‌ జాతికి అత్యధిక డిమాండ్‌ ఉంది. అందుకే ఈ క్రోకర్ జాతి చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. దీని చర్మాన్ని, ఎముకలను ఔషధాల్లో, ఇతర వైద్యపరమైన అంశాల్లో వాడతారు. వేలంలో ధర ఇంకా ఎక్కువే పలికింది. రూ 86.4 లక్షల వరకు వెళ్లింది. అయితే అంత ధరకు చేజిక్కించుకున్నవారికి రాయితీ ఇవ్వడం స్థానికంగా సంప్రదాయమట. వేలం అధికారులు చివరికి రూ.72 లక్షలుగా ధరను ఖరారు చేశారు. మొత్తానికి ఒక్క చేపతో అబూబాకర్ జీవితం మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: