డాక్టర్ చావుతోనూ రాజకీయమేనా.. బాబుపై విజయసాయి ఫైర్‌..?

Chakravarthi Kalyan
విజయసాయిరెడ్డి.. ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న వ్యక్తి. అంతే కాదు.. వైసీపీలో చాలా కీలకమైన నాయకుడు. జగన్ తర్వాత పార్టీ వాయిస్‌ను అధికారికంగా ప్రకటించగల స్థాయి ఉన్న నేతగా చెప్పుకుంటారు. అంతే కాదు.. విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచూ ట్వీట్లు, ఫేస్‌బుక్‌ పోస్టులతో సంచలనాలు సృష్టిస్తుంటారు. ప్రత్యేకించి తెలుగుదేశం పై ఘాటు విమర్శలు చేస్తుంటారు. ఇక చంద్రబాబు, లోకేశ్‌ వంటి నాయకులను ఆయన తరచూ టార్గెట్ చేస్తుంటారు.
తాజాగా విజయసాయిరెడ్డి చంద్రబాబుపై ట్విట్టర్‌లో మరోసారి విరుచుకుపడ్డారు. ఇటీవల నర్సీపట్నం అనస్థీషియా వైద్యుడు సుధాకర్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతిపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుధాకర్ మరణం ప్రభుత్వ హత్య అంటూ విమర్శించారు. ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే డాక్టర్ సుధాకర్ ఇలా గుండెపోటుతో మరణించారని విమర్శించారు.
చంద్రబాబు విమర్శలకు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. " శవాలపై పేలాలు ఏరుకునేవాడిలా నీ శవ రాజకీయాలేంటి చంద్రబాబూ? శవం దొరికితే చాలు రాబందులా వాలి రాజకీయం చేస్తున్నావు. ఇంత దరిద్రపు ప్రతిపక్షం ఎక్కడా లేదు. డాక్టర్ సుధాకర్ మృతితో ఆ కుటుంబం విషాదంలో ఉంటే నీ పాలిట్రిక్స్ ఏంటి? అంత ప్రేమున్నోడివి ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎందుకివ్వలేదు?” అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.
ఈ ట్వీట్‌తో విజయసాయిరెడ్డి మరో అంశం తెరపైకి తెచ్చినట్టయింది. డాక్టర్ సుధాకర్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ అడిగినట్టు తన ట్వీట్‌లో ఆయన ప్రస్తావించారు. మరి నిజంగానే డాక్టర్ సుధాకర్ ఎమ్మెల్యే టిక్కెట్ అడిగారా.. లేదా అన్నది తెలియదు. ఆ విషయం చెప్పేందుకు ఆయన లేరు. మరి ఇప్పుడు ఈ ప్రశ్నకు టీడీపీ ఎలా బదులిస్తుందో చూడాలి. మొత్తానికి విజయసాయిరెడ్డి డాక్టర్ సుధాకర్ మృతి, చంద్రబాబు స్పందనపై ఆలస్యంగా స్పందించినా.. తనదైన శైలిలో కొత్త వివాదానికి తెర లేపారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: