గుంటూరులో రజినికి ఫిక్స్ అవుతుందా?

M N Amaleswara rao

ఏపీలో మరోసారి మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గరపడుతుంది. జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయిపోతుంది. అంటే ఇంకో 6 నెలల్లో మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. జగన్ సీఎం అయిన వెంటనే 25 మందితో ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక అప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కని వారికి మరోసారి అవకాశం కల్పిస్తానని చెప్పారు.


ఇప్పుడున్న మంత్రుల్లో పనితీరు బాగోని వారిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇస్తానని జగన్ చెప్పారు. దీంతో జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకోవడానికి ఇటు సీనియర్, అటు జూనియర్ ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. అలాగే తమ పదవులని కాపాడుకోవాలని మంత్రులు చూస్తున్నారు. అయితే ఏది ఎలా జరిగినా జగన్ మాత్రం కేబినెట్‌ని ప్రక్షాళన చేయడం ఖాయంగా కనిపిస్తోంది.


ప్రస్తుతం ఉన్నవారిలో పనితీరు బాగోని వారిని పక్కనబెట్టేసి కొత్తవారికి అవకాశం ఇవ్వడం ఖాయం. ఇక ఇదే క్రమంలో గుంటూరు జిల్లాకు ఒకటి లేదా రెండు మంత్రి పదవులు దక్కే అవకాశముంది. ఎందుకంటే ప్రస్తుతానికి గుంటూరు జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉన్నది మేకతోటి సుచరిత మాత్రమే. మండలి రద్దు నిర్ణయంతో మోపిదేవి వెంకటరమణని మంత్రివర్గం నుంచి తప్పించి రాజ్యసభ ఇచ్చిన విషయం తెలిసిందే.


దీంతో గుంటూరులో సుచరిత మాత్రమే జగన్ కేబినెట్‌లో ఉన్నారు. అయితే పెద్ద జిల్లా కాబట్టి మరో రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక మంత్రిగా ఛాన్స్ కొట్టేయాలని జిల్లాలోని సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఇక అందులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, సత్తెనపలి ఎమ్మెల్యే అంబటి రాంబాబు లాంటి వారు మంత్రి పదవి ఆశిస్తున్నారు.


అటు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ముఖ్యంగా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుని చిత్తుగా ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయిన విడదల రజిని సైతం పదవిని ఆశిస్తున్నారని తెలుస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజిని రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇలా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రజిని సైతం మంత్రి పదవి వస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి వీరిలో జగన్ ఎవరికి బెర్త్ ఖాయం చేస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: