ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్‌లో ఏముందంటే...

Garikapati Rajesh

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దుచేయాలంటూ అదే పార్టీకి చెందిన న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు హైద‌రాబాద్ సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. ఎంపీ త‌న పిటిష‌న్‌లో ఏయే అంశాలు పొందుప‌రిచారో ఒక‌సారి ప‌రిశీలిద్దాం. బెయిల్‌పై బ‌య‌ట ఉండ‌టంవ‌ల్ల జ‌గ‌న్ సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. కేసుల్లో సాక్షులుగా మార‌తారునుకున్న‌వారంతా ఇప్పుడు ప‌దవులు అనుభ‌విస్తున్నార‌ని, వారు సాక్ష్యాలుగా మార‌కుండా ముఖ్య‌మంత్రే వారికి ప‌ద‌వులు కేటాయించార‌ని ఎంపీ పిటిష‌న్‌లో వివ‌రించారు. ‌
విజ‌య‌సాయిరెడ్డికి రాజ్య‌స‌భ సీటు
జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితునిగా ఉన్న ఏ2 విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడమే కాకుండా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారని ఎంపీ గుర్తుచేశారు. ఇదే కేసులో నిందితునిగా ఉన్న ఆదిత్యనాథ్‌దాస్‌ ఇపుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, ఆయ‌న‌కన్నా మరో ఇద్దరు సీనియర్‌ అధికారులున్నా... ఆదిత్యనాథ్‌కు సీఎస్‌ పదవి ఇచ్చారన్నారు.
సహ నిందితునిగా ఉన్న అయోధ్యరామిరెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా చేశార‌ని తెలిపారు. ఎమ్మార్‌ కేసులో ముద్దాయి కోనేరు ప్రసాద్‌కు విజయవాడ లోక్‌సభ ఎంపీ టికెట్‌ ఇచ్చార‌ని, అక్రమాస్తుల కేసులో నిందితునిగా ఉన్న ధర్మాన ప్రసాదరావుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారని, ఆయన సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని ర‌ఘురామ పిటిష‌న్‌లో వివ‌రించారు.
శ్రీ‌ల‌క్ష్మికి ప‌దోన్న‌తి
త‌న‌తోపాటు జైలుకు వెళ్ళిన ఐఏఎస్ అధికారిశ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్‌ నుంచి తీసుకుని తన ప్రభుత్వంలో అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీగా నియమించారని, అలాగే తనకేసులోనే నిందితునిగా ఉన్న శామ్యూల్‌ను కేబినెట్‌ ర్యాంక్‌తో ప్రభుత్వంలో సలహాదారుగా ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్‌రెడ్డి నియ‌మించుకున్నార‌ని ఎంపీ త‌న పిటిష‌న్‌లో తెలియ‌జేశారు. మొత్తం సాక్ష్యాలను తారుమారు చేసి, కేసులను నిర్వీర్యం చేసేందుకు వీరంతా ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. ఉత్తరప్రదేశ్‌, అమరామణి త్రిపాఠి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న కొన్ని కీలక అంశాలను ఎంపీ ప్రస్తావించారు. వాటిలోఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్నవారు ప్రభుత్వ పదవుల్లో ఉండేందుకు అనుమతించకూడ‌దంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా త‌న పిటిష‌న్‌కు జ‌త‌చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: