తిరుపతిలో రెండో స్థానం కోసమే పోటీనా?

SRISHIVA
ఎక్కడైనా ఎన్నిక జరిగితే గెలుపు కోసం అన్ని పార్టీలు పోరాడుతాయి. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతాయి. కాని ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తిరుపతిలో గెలుపు ముందే ఖాయమైందని, రెండో స్థానం ఎవరికి వస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారిందని అంటున్నారు.
2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసిన బల్లి దుర్గాప్రసాద రావు 2 లక్షల 25 వేల ఓట్లతో.. అప్పటి టీడీపీ అభ్యర్థి , కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిపై గెలిచారు. గత ఏడాది ఆగస్టు 17న అనారోగ్యంతో దుర్గాప్రసాదరావు చనిపోవడంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది. బై పోల్ లో టీడీపీ నుంచి తిరిగి పనబాక లక్ష్మి బరిలో ఉండగా... అధికార పార్టీ అభ్యర్థిగా సీఎం జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి పోటీలో ఉన్నారు. తిరుపతిలో జనసేనతో కలిసి పోటీ చేస్తోంది బీజేపీ. ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ మరోసారి బరిలో నిలిచారు.
అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. అయితే గతంలో 2 లక్షలకు పైగా లీడ్ సాధించిన వైసీపీ.. ఈసారి ఐదు లక్షలు టార్గెట్ గా పెట్టుకుంది. నియోజకవర్గానికో మంత్రిని, మండలానికో ఎమ్మెల్యేను రంగంలోకి దింపారు జగన్. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ పరిధిలో దాదాపు 90 శాతం సీట్లు వైసీపీనే గెలుచుకుంది. దీంతో తిరుపతిలో ఆ పార్టీ గెలుపునకు డోకా లేదంటున్నారు. ఆ పార్టీకి వచ్చే మెజార్టీ ఎంత అన్నదానిపైనే జనాల్లో చర్చ జరుగుతోందని తెలుస్తోంది.
ఇక తిరుపతిలో టీడీపీ, బీజేపీ కూటమి మధ్య గట్టి పోటీ ఉందని అంటున్నారు. రెండో స్థానం దక్కించుకోవడానికి ఆ రెండు పార్టీలు పోరాడుతున్నాయనే చర్చ  రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తిరుపతిలో టీడీపీ కంటే ముందు నిలిచి.. ఏపీలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని చాటాలని కమల దళం పావులు కదుపుతోంది. అటు టీడీపీ కూడా రెండో స్థానం సాధింకపోతే పార్టీ భవిష్యత్ కు గండం అనే భయంతో సమరం సాగిస్తోందని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వైసీపీకి ప్రత్యామ్నాయాన్ని తెలుసుకునేందుకు మాత్రమే తిరుపతి ఎన్నిక అని స్పష్టం చేశారు. తద్వారా ప్రథమస్థానం తమదేనని, తమ తర్వాత రెండో స్థానంలో నిలిచే పార్టీ ఏదన్న విషయం ఈ ఉప ఎన్నిక ద్వారా తెలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: