చంద్రబాబుకు బిగ్ షాక్.. పార్టీ పదవికి కీలక నేత రాజీనామా

SRISHIVA
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబుకు ఆ పార్టీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ షాకిచ్చారు. పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని విభేదిస్తూ తన ఉపాధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. కేవలం తాను జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగానే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్ణయం తనను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని జ్యోతుల నెహ్రూ చెప్పారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు ప్రకటించిన కాసేపటికే జ్యోతుల నెహ్రు పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయడం టీడీపీలో కలకలం రేపుతోంది. జ్యోతుల నెహ్రు గతంలో వైసీపీలో పని చేశారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. 2014లో వైసీపీ నుంచే గెలిచారు. తర్వాత అప్పటి అధికార పార్టీ టీడీపీలో చేరారు.గత ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పుట్టగతులు లేకుండా పోయిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ జ్యోతిని ఆర్పేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారని పేర్కొన్నారు. ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు కాదని అన్నారు. ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను.. ప్రారంభిస్తే తప్పేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎందుకు అడగలేదని నిలదీశారు. చంద్రబాబు ఏనాడూ ఒంటరిగా అధికారంలోకి రాలేదని గుర్తుచేశారు.
రేపు అసెంబ్లీ, పార్లమెంట్‌కు కూడా అభ్యర్థులు దొరకరని చంద్రబాబు త్వరలో పార్టీని కూడా రద్దు చేస్తారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నువ్వు రాజకీయ నాయకుడివి కాదు.. పిరికివాడివి అంటూ మండిపడ్డారు. తిరుపతిలో కూడా పోటీ విరమించుకుంటారా అని ప్రశ్నించారు. వెన్నుపోటు ద్వారా రాజ్యాధికారం సాధించారు.. ఎన్నికలకు వెళ్లినా.. గెలిచేటట్టు లేదు చంద్రబాబుకు తెలిసే ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు అని అంబటి రాంబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: