గుర్తులు వచ్చాకా బహిష్కరణ ఎలా సాధ్యం!

SRISHIVA
పరిషత్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఇప్పటికే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీలు స్పీడ్ పెంచగా.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార వైసీపీ... పరిషత్ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తోంది. అయితే ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని ఆరోపిస్తున్న టీడీపీ..   త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడినట్టు భావిస్తున్న టీడీపీ అందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకున్నా.. అది ఎంతవరకు సాధ్యమనే చర్చ వస్తోంది. ఎందుకంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 2020 మార్చిలోనే నామినేషన్ల ప్రక్రి. ముగిసింది. నామినేషన్ల ఉప సంహరణలు కూడా ముగిశాయి. ఆయా స్థానాలకు అభ్యర్తుల లెక్క కూడా తేలింది. ఇప్పుడు టీడీపీ బహిష్కరించినా... ఆ పార్టీ తరపున నామినేషన్ వేసిన అభర్థుల విత్ డ్రా కుదరదు. టీడీపీ గుర్తులు కూడా బ్యాలెట్ పేపర్ లో ఉంటాయి. అంటే టీడీపీ పోటీ చేస్తున్నట్టే లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నిర్ణయం ఎలా వర్కవుట్ అవుతుందన్న చర్చ వస్తోంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించుకుందన్న వార్తలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇప్పటివరకు నిమ్మగడ్డను అడ్డంపెట్టుకుని ఆటలు ఆడారని, ఇప్పుడు ఆ ఆటలు సాగవని తెలుసుకుని కొత్త నాటకానికి తెరదీశారని విమర్శించారు. అయినా ప్రజలు ఎప్పుడో టీడీపీని బహిష్కరించారని, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం అని విమర్శించారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా టీడీపీపై వ్యాఖ్యలు చేశారు. మీదే ఆలస్యం, మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో బహిష్కరించారని ఎద్దేవా చేశారు. ఎన్నికలను బహిష్కరిస్తే మీ పార్టీ బతకదు... లోకేశ్ బాబును బహిష్కరిస్తే ఫలితం ఉండొచ్చని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: