స్వీడన్ లో చదివితే ఇండియాలో సర్టిఫికేట్ పనికి రాదా...?

Gullapally Rajesh
కాంగ్రెస్ నుంచి గెలిచి తెరాస లో అడుగు పెట్టిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ నేతలు నేడు కీలక వ్యాఖ్యలు చేసారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్నికల ఆఫీడవిట్లకు పొంతన లేదు అని కేంద్ర మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. 2009, 2018 ఎన్నికల అఫిడవిట్ లో విరుద్ధ విద్యార్హతలు చూపెట్టారు అని ఆయన ఆరోపించారు. స్వీడన్ లో బీటెక్ చేసినట్లుగా 2009 ఎన్నికల్లో చెప్పారు అని, 2018లో ఇంటర్ విద్యార్హతగా చూపెట్టారు అని వెల్లడించారు.
ఇప్పుడు కొత్తగా కాలిఫోర్నియాలో ఎంబీఏ, ఎంఎస్ఈ చేసినట్లు చెబుతున్నారు అని వెల్లడించారు. డిగ్రీ విద్యార్హత లేకున్నా తప్పుడు పత్రాలతో పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకున్నారు అని ఆరోపణలు చేసారు. మోసాలు చేయడం రోహిత్ రెడ్డికి అలవాటు అయింది అని ఒక అఫిడవిట్ కు మరో అఫిడవిట్ కు పొంతన లేదు అంటూ ఆరోపణలు చేసారు. ఆయనకు అసలు డిగ్రీ నే లేదు అని, తప్పుడు అఫిడవిట్ సమర్పించిన రోహిత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. ఆయన విద్యార్హతల పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి అని కోరారు.
జిల్లా కలెక్టర్ ను విచారణకు అదేశిస్తామని శశాంక్ గోయల్ చెప్పారు అని, దొంగ సర్టిఫికేట్ ల వ్యవహారంలో రోహిత్ పాత్ర మీద కూడా అనుమానాలు ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. దీని పై డీజీపీ కి కూడా ఫిర్యాదు చేస్తాం అని స్పష్టం చేసారు. రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా అనర్హుడు అని, గవర్నర్ ను కూడా కలిసి అనర్హత వేటు వేయాలని కోరుతాం అన్నారు. మాజీ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి మాట్లాడుతూ... పైలట్ రోహిత్ రెడ్డి చూపెట్టిన విద్యార్హత సర్టిఫికెట్ ఇండియాలో చెల్లుబాటు కాదు అని అన్నారు. స్వీడన్ లో సర్టిఫికేట్ లకు మన దేశంలో గుర్తింపు లేదు అని వెల్లడించారు. ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం తప్పుడు ధ్రువ పత్రాలు పెట్టిన రోహిత్ పై అనర్హత వేటు వేయాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: