చాగంటిని టార్గెట్ చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ..?

Chakravarthi Kalyan
చాగంటి కోటేశ్వరరావు.. ఈమధ్య ఈ ఆధ్యాత్మిక వేత్త బాగా పాపులర్ అయ్యారు. ఆయన ప్రసంగాలు ప్రసారం చేయని ఛానల్ లేదంటే అతిశయోక్తి కాదు.. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తి కార్యక్రమాలకు క్రేజ్ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని ఛానళ్లు చాగంటి ప్రవచనాలను ప్రసారం చేస్తున్నాయి. పిల్లలకు, పెద్దలకూ, పండితులకూ, పామరులకు సులభంగా అర్థమయ్యేలా ఆధ్యాత్మిక విశేషాలు చెబుతుండటం వల్ల చాగంటికి విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. 

అలాంటి చాగంటిని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎందుకనో టార్గెట్ చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాజమండ్రిలో చాగంటి ప్రవచనాలను ఏర్పాటు చేసింది. రాజమండ్రిలో 13వ తేదీ సాయంత్రం చేసిన ఉపన్యాసంలో చాగంటి... అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆంధ్రజ్యోతి సంపాదకీయం రాసింది. పుష్కరాలు ప్రారంభ ముహూర్తంలోనే స్నానం చేస్తే పుణ్యం సిద్ధిస్తుందనీ, పనిలో పనిగా గోదావరిలో మునిగినవారు ఒడ్డున ఉన్న కాస్త మట్టి తీసి నదిలో వేయాలని చాగంటి సెలవిచ్చినట్టు రాసింది. 

చాగంటి వల్లే తొక్కిసలాట జరిగిందా..?


మొత్తానికి చాగంటి లాంటి వారు అలా చెప్పబట్టే పుష్కరాల తొలిరోజు.. మహావిషాదం జరిగిందన్నట్టు ఆంధ్రజ్యోతి కలరింగ్ ఇచ్చింది. తమను ఎవరు ఎక్కువగా నమ్మించగలిగితే వారు అంత గొప్పగా ప్రవచనాలు చెప్పినట్టుగా ప్రజలు పరిగణిస్తారని... చాగంటి కోటేశ్వరరావు ఈ విద్యలో మిగతావారికంటే ఒక అడుగు ముందే ఉన్నారంటూ ఆంధ్రజ్యోతి ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతేకాదు.. గోదావరిలో మట్టివేయాలన్న చాగంటి మాటలను కూడా తీవ్రంగా తప్పుబట్టింది. 

గోదావరిలో మట్టి వేయకపోతే కృత్య అనే రాక్షసి పుష్కర స్నానం చేసిన వారి పుణ్యాన్ని తినేస్తుందని చాగంటి చెప్పారని ఆంధ్రజ్యోతి రాసింది.  అదృష్టవశాత్తూ చాగంటి మాట విని.. అంతా మట్టి వేసి ఉంటే.. బురద వల్ల కాలు జారి ఎముకలు విరగ్గొట్టుకునేవారని ఆంధ్రజ్యోతి రాసింది. కానీ ఇక్కడ ఓ విషయమేమంటే.. ఒక్కరంటే ఒక్కరు కూడా చాగంటి చెప్పినట్టు మట్టి వేయలేదని ఆంధ్రజ్యోతే రాసింది. మరి అలాంటి వారు చాగంటి మాటలు విని పుష్కర ముహూర్తంలోనే స్నానానికి పోటీపడ్డారని ఆంధ్రజ్యోతి ఎలా చెబుతుంది. పరస్పర విరుద్దమైన ఈ రాతల్లో వాస్తవం ఉందా. ఆలోచించాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: